ఇప్పటికే 15 ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ కోసం ఆర్సీబీ పోరాటం కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ 2023 సీజన్ కూడా వచ్చేసింది. ఈ సారి జట్టు బాగుంది, కప్పు గ్యారంటీ అని ఆశపడుతున్న అభిమానులకు చేదువార్త.
మరికొన్ని రోజుల్లో ధనాధన్ క్రికెట్ లీగ్ ఆరంభం కానుంది. ఎప్పటిలాగే క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి టైటిల్ కోసం కళ్లు కాయాలు కాసేలా ఎదురుచూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు అభిమానులు.. ఈ ఏడాది ఎలాగైనా ఆర్సీబీ కప్పు కొడుతుందని కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ఐపీఎల్ సీజన్ 2023 ఆరంభానికి ముందే ఆర్సీబీకి ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ 2023 వేలంలో ఆర్సీబీ ఎంతో ప్లాన్ చేసి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ఐపీఎల్ 2023 సీజన్‌కు దూరం కానున్నట్లు సమాచారం. దీంతో ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే ఆర్సీబీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.
అయితే.. తాజాగా బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ జట్టులో విల్ జాక్స్ సభ్యుడిగా ఉన్నాడు. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలిచిన ఇంగ్లండ్, టీ20 సిరీస్‌ను మాత్రం 0-3తో ఓడిపోయింది. కాగా.. వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో జాక్స్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఈ గాయం నుంచి కోలుకోవడానికి జాక్స్‌కు చాలా సమయం కావాలని వైద్యులు సూచించనట్లు తెలుస్తోంది. దీంతో జాక్స్ ఐపీఎల్‌కు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. గతకొన్నేళ్లుగా జాక్స్ టీ20 క్రికెట్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో.. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్సీబీకి జాక్స్ మంచి ఎసెట్ అవుతాడని అతా భావించారు. కానీ.. అతను గాయంతో టోర్నీకి దూరం అయ్యేలా కనిపిస్తున్నాడు.
ఇప్పటి వరకు విల్ జాక్స్ ఒక్కసారి కూడా ఐపీఎల్ ఆడలేదు. ఈ సారి అరంగేట్రం చేస్తాడనుకుంటే దురదృష్టవశాత్తు గాయంతో దూరం కానున్నాడు. ఇటివల ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ జాక్స్ అదరగొట్టాడు. కానీ.. ఐపీఎల్‌లో అతని మెరుపులు చూసే అవకాశం దక్కేలాలేదు. అయితే.. జాక్స్ పూర్తిగా ఐపీఎల్‌కు దూరం అయితే అతని స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్‌ను జట్టులోకి తీసుకోవాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే.. ఆర్సీబీ మరింత బలపడటం ఖాయం. విల్ జాక్స్ స్థానంలో బ్రేస్‌వెల్ మంచి ఎంపిక అవుతుందని, క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Will Jacks ruled out of the IPL 2023.
RCB in talks with Micheal Bracewell. (Source – Espn Cricinfo)
— Johns. (@CricCrazyJohns) March 15, 2023