ఈ మధ్య కాలంలో ఐదు రోజులు జరగాల్సిన టెస్టు మ్యాచ్‌లు.. మూడు రోజుల్లోనే ముగుస్తున్నాయి. ఇలాంటి మ్యాచ్‌లతో ఫలితం తేలుతున్నా.. క్రికెట్ అభిమానులకు మజా మాత్రం రావడం లేదు. మరి టెస్టు క్రికెట్‌లో జరుగుతున్న ఈ తప్పుకు కారణం ఏంటి? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
అసలు సిసలైన క్రికెట్ మజా టెస్టు మ్యాచ్‌లోనే ఉంటుంది. బెట్టింగ్ బాబులను కాకుండా.. నిజంగా క్రికెట్‌ను అభిమానించే వారు ఎవరైనా చెప్పే మాట ఇదే. క్రికెట్ అంటే టెస్టు క్రికెట్టే. ఆటగాళ్లలోని అసలు సత్తాను బయటపెడుతూ.. ప్రతి బాల్ ఒక అగ్నిపరీక్షలా మారుతున్నప్పుడు.. వాటిని తట్టుకుని నిలబడి ఆడాదే అసలైన క్రికెట్. పూట పూటకు చేతులు మారుతున్న మ్యాచ్, ఎవరు గెలుస్తారో.. చివరి వరకు కూడా చెప్పడం కష్టం. సెషన్ సెషన్‌కు ఆధిక్యం మారుతూ ఉంటుంది. నాలుగు రోజుల పాటు ఆటపై పట్టు సాధించి.. చివరి రోజు విజయం కోసం చేసే పోరాటం అయితే నెక్ట్స్ లెవల్. అలాంటి టెస్టు మ్యాచ్‌లు చూసి చాలా కాలం అయింది. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాలోని గాబాలో భారత్-ఆసీస్ మధ్య చివరి రోజు వరకు సాగిన మ్యాచ్ ఎంత ఉత్కంఠగా జరిగి.. ఎలాంటి వినోదాన్ని, ఆనందాన్ని అందించిందో క్రికెట్ అభిమానులకు ఇంకా గుర్తే. ఆ రోజు పంత్ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ భారత క్రికెట్ అభిమానుల కళ్లల్లో కదలాడుతూనే ఉంటుంది. అలాంటి మ్యాచ్‌లు ఎప్పుడో అమాసపుణ్యానికి జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే ముగుస్తూ.. క్రికెట్ అభిమానులకు టెస్టు క్రికెట్‌పై ఉండే ప్రేమ, ఆసక్తిని చంపేస్తున్నాయి.
దీనినంతటికి కారణం.. ఫాస్ట్‌ఫుడ్ లాంటి టీ20 క్రికెట్‌కు అలవాటు పడ్డ క్రికెటర్లే. టీ20 క్రికెట్‌కు బాగా అలవాటు పడిన ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌ను సర్వనాశనం చేస్తున్నారు. టెస్టు క్రికెట్ అంటేనే టెక్నిక్‌కు, టాలెంట్‌కు, ఓపికకు పరీక్ష పెట్టే ఫార్మాట్. ఇలాంటి ఫార్మాట్‌లోనూ ఆటగాళ్లు ఎంత త్వరగా విజయం సాధించామని చూస్తున్నారే కానీ.. అది వారి చేతకానీ తనంగా గుర్తించలేకపోతున్నారు. జట్టు కష్టాల్లో ఉంటే.. గంటల తరబడి క్రీజ్‌లో పాతుకుపోయి, ఇన్నింగ్స్‌ను నిలబెట్టడం అంటే మాటలు కాదు. అలాంటి ఆటను గతంలో చాలా మంది గొప్ప గొప్ప క్రికెటర్లు ఆడి చూపించారు. వెస్టిండీస్ దిగ్గజం శివనారాయణ్ చంద్రపాల్ , మన భారత దిగ్గజలు సునీల్ గవాస్కర్. రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి ఆటగాళ్లు క్రీజ్‌లో కుదురుకుంటే.. అవుట్ చేసేందుకు బౌలర్లకు చుక్కలు కనిపించేవి. మ్యాచ్ సంగతి దేవుడెరుగు, ముందు వీళ్లు అవుటైతే చాలు స్వామి అని బౌలర్లు ప్రార్థించేవారు.
ఇలాంటి చైనా వాల్స్ కాకుండా.. దూకుడుగా ఆడుతూ కూడా టెస్టు క్రికెట్‌కు వన్నె తెచ్చిన ఆటగాళ్లు ఉన్నారు. వారిలో బ్రియన్ లారా, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రివీ పాంటింగ్ లాంటి ఆటగాళ్లు ముందు వరుసలో ఉంటారు. జట్టు పరిస్థితిలకు తగ్గట్లు ఆడుతూనే.. వారి సహజశైలిని కోల్పోకుండా బ్యాటింగ్ చేసేవారు. వారు ఆడుతుంటే టెస్టు క్రికెట్‌కే అందం వచ్చేది. కానీ.. ఇప్పుడున్న టెస్టు క్రికెట్‌లో అది మిస్ అవుతుంది. గతంలో ఎక్కువశాతం మ్యాచ్‌లు డ్రాగా ముగిసినా.. మ్యాచ్‌ల్లో హోరాహోరీ పోరాటం ఉండేది. ఇరు జట్లు మ్యాచ్‌పై పట్టువదలకపోవడంతో ఆ మ్యాచ్‌లు డ్రాగా ముగిసివేవి. కానీ.. ఇప్పుడు మ్యాచ్‌లు మాత్రం మూడు రోజుల్లోనే ముగుస్తున్నాయి. ఇదేదో ఆటగాళ్ల గొప్పగానో, పిచ్ వల్లనో అనుకుంటే.. కచ్చితంగా పోరపాటే. ఇది నిస్సందేహంగా ఆటగాళ్ల చేతకానితనమే అని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఇప్పుడున్న చాలా మంది క్రికెటర్లలో ఐదు రోజుల పాటు క్రికెట్ ఆడే సత్తా లేదు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడి గంటల కొద్ది, అవసరమైతే రోజుల కొద్ది బ్యాటింగ్ చేసే సామర్థ్యం లేదు.
దాదాపు అన్ని జట్లలోని ఆటగాళ్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఐదు రోజులు ఆడే సత్తా లేక.. ఒక రోజులోనో, రోజున్నరలోనే ఆలౌట్ అయిపోతున్నారు. ప్రత్యర్థి జట్టు తీరు కూడా అదే కావడంతో మూడు రోజుల్లో ఫలితం వచ్చేస్తోంది. అంతే తప్ప.. అది ఆటగాళ్ల గొప్పతనమో, పిచ్‌ల వల్లనో కాదు. ఎందుకంటే గతంలో మాజీ క్రికెటర్లు కూడా ఆడింది ఈ పిచ్‌లపైనే. ఇప్పటి కంటే గొప్ప స్పిన్నర్లు, పేస్ బౌలర్లు అప్పుడూ ఉన్నారు. కానీ.. బ్యాటర్లు నిలబడి, చాలా ఓపికగా ఆడేవారు. ఆ ఓపిక ఈ తరం ఆటగాళ్లలో లేదు. టీ20 క్రికెట్‌లకు బాగా రుచిమరిగి.. ఫలితం రావడమే గొప్ప అనుకుంటున్నారు. ఎలాంటి పిచ్‌పైనైనా, ఎలాంటి బౌలింగ్‌నైనా ఎదుర్కొని రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేయగలిగే ఆటగాడు ఒక్కడు కూడా కనిపించడం లేదు. చాలా మంది సాంప్రదాయ క్రికెట్ అభిమానులకు ఈ మూడు రోజుల టెస్టు క్రికెట్ ససేమీర నచ్చదు. ఇలాంటి పరిస్థితి టెస్టు క్రికెట్‌కు రావడానికి కారణం.. ఆటగాళ్లు లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌కు బాగా అలవాటు పడటమే అని చాలా మంది క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
తాజాగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రెండు టెస్టులు కూడా మూడు రోజుల్లోనే ముగిశాయి. ఇక్కడ పిచ్‌ల కంటే కూడా ఆటగాళ్ల సామర్థ్య లోపంతోనే మ్యాచ్‌లు త్వరగా ముగుస్తున్నాయి. అలాగే ఇంగ్లండ్-పాకిస్థాన్ సిరీస్‌లో కూడా మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే ముగిశాయి. తాజాగా రెండు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ వెళ్లిన ఇంగ్లండ్.. తొలి టెస్టును నాలుగో రోజు ఉదయం ముగించింది. టెస్టు క్రికెట్‌లో గతంలో కంటే ఫలితాలు తేలే మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతుందని అనుకోవచ్చు కానీ.. అది ఆటగాళ్లు సరిగ్గా ఆడక ఫలితం తేలుతున్న మ్యాచ్‌లు. ఇటివల ఇంగ్లండ్ టెస్టు క్రికెట్‌కు అర్థం చెప్తామంటూ.. అగ్రెసివ్ క్రికెట్ అంటూ అర్థం లేని వాదనను తెరపైకి తీసుకొచ్చింది. నిజానికి అంది కూడా టెస్టు క్రికెట్‌లోని ఆత్మను చంపేసే స్ట్రాటజీనే. ఐదురోజుల పాటు ఆడే సత్తా, సహనం లేక దానికి అగ్రెసివ్ ప్లే అంటూ పేరు పెట్టుకుని, గుడ్డిగా బ్యాటింగ్ చేయడమే వారి స్ట్రాటజీ. వర్క్ అవుట్ అయితే ఓకే లేదా.. ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతుంది.. ఫలితం మూడు రోజుల్లోనే వచ్చేస్తోంది. ఇలా టెస్టు క్రికెట్‌ను టెస్టు క్రికెట్‌లా ఆడే సత్తా లేని నేటి తరం ఆటగాళ్లు మ్యాచ్‌లు గెలుస్తున్నా అందులోని ఆత్మను చంపేస్తున్నారంటూ క్రికెట్ అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
In his 1️⃣0️⃣0️⃣th Test, @cheteshwar1 finishes off the chase in style 🙌🏻#TeamIndia secure a 6️⃣-wicket victory in the second #INDvAUS Test here in Delhi 👏🏻👏🏻
Scorecard ▶️ https://t.co/hQpFkyZGW8@mastercardindia pic.twitter.com/Ebpi7zbPD0
— BCCI (@BCCI) February 19, 2023