టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ముక్కులోంచి రక్తం వచ్చింది. జెర్సీపై రక్తం చుక్కలు కూడా పడ్డాయి. ఆదివారం సౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా ఈ ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడూ అగ్రెసివ్‌గా ఉండే రోహిత్ ఇలా రక్తం చిందుకుంటూ గ్రౌండ్ బయటికి పరుగులు తీయడంతో అతని అభిమానులు.. రోహిత్‌కు ఏమైందంటూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇంతకు ఏం జరిగిందంటే.. సౌతాఫ్రికా బ్యాటింగ్ సందర్భంగా ఇన్నింగ్స్ మధ్యలో రోహిత్ శర్మ ముక్కలో నుంచి రక్తం కారడం మొదలైంది. అది గమనించిన దినేష్ కార్తీక్ కర్చీఫ్ తీసుకొచ్చి రోహిత్ చేతికి ఇచ్చి ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికే రెండు మూడు చుక్కల రక్తం రోహిత్ జెర్సీపై కూడా పడ్డాయి. ఈ దృశ్యాలు అందరిని ఆందోళనకు గురి చేశాయి.
కానీ.. ముక్కులోంచి రక్తం కారుతున్నా దాన్ని తుడుచుకుంటూనే బౌలర్ హర్షల్ పటేల్‌కు సూచనలు ఇస్తూ రోహిత్ ఆట పట్ల తన డెడికేషన్‌ను చాటుకున్నాడు. ఎంతకీ రక్తం కారడం ఆగకపోవడంతో డ్రెసింగ్ రూమ్‌కు పరిగెత్తాడు. ప్రథమ చికిత్స తీసుకుని కొద్ది సేపటి తర్వాత మళ్లీ మైదానంలోకి దిగాడు. కాగా.. డీహైడ్రెషన్ కారణంగానే రోహిత్ ముక్కులోంచి రక్తం వచ్చిందని, పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయ కాదని టీమిండియా వైద్య బృందం వెల్లడించినట్లు సమాచారం. అయినా కూడా టీ20 వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీ ముందు రోహిత్‌కు ఇలా జరగడంపై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ సైతం ఒకింత ఆందోళన చెందుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 61 పరుగులు చేసి అదరగొట్టాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్(57), కెప్టెన్ రోహిత్ శర్మ(43, విరాట్ కోహ్లీ(49 నాటౌట్), దినేష్ కార్తీక్(7 బంతుల్లో 17 నాటౌట్) రాణించడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. ఈ భారీ లక్ష్యఛేదనను నిదానంగా ఆరంభించిన సౌతాఫ్రికా అర్ధభాగం నుంచి జోరు పెంచినా.. అప్పటికే ఆలస్యం అయిపోయింది. కానీ.. డేవిడ్ మిల్లర్ మాత్రం సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. రిక్వైర్డ్ రన్‌రేట్ భారీగా ఉన్నా మిల్లర్ టీమిండియాను ఆందోళన పరిచాడు. డికాక్ కూడా హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ 16 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఓడింది. మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ మంగళవారం ఇండోర్‌లో జరగనుంది.
Dedication 🙌
Rohit sharma kept giving instructions even after nose bleeding#INDvSA #RohitSharma𓃵 pic.twitter.com/kc4jgdpXoq— Shridas Meena (@ShridasMeena3) October 3, 2022
ఇది కూడా చదవండి: భారీ స్కోర్‌తో బయటపడ్డ టీమిండియా! భయపెట్టిన మిల్లర్