టీమిండియా ప్లేయర్ల ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు, పీసీబీ మాజీ చైర్మన్ రమీజ్ రాజా ఎప్పుడూ విమర్శలు చేస్తుంటాడు. భారత ఆటగాళ్లతో పాటు బీసీసీఐ పైనా ఆయన అవాకులు చెవాకులు పేలుతుండేవాడు. అలాంటి రమీజ్ రాజా తొలిసారి టీమిండియా యువ క్రికెటర్ మీద ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్‌తో రెండు వన్డేల్లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడి, జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించిన శుభ్‌మన్ గిల్‌ను రమీజ్ రాజా మెచ్చుకున్నాడు. భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మలా ఆడుతున్నాడని, హిట్ మ్యాన్‌కు అతడు మినీ వెర్షన్‌లా కనిపిస్తున్నాడని కొనియాడాడు. ఇదే ఆటతీరును కొనసాగిస్తే భవిష్యత్తులో భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతాడన్నాడు.
‘శుభ్‌మన్ గిల్ ఆట నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అతడ్ని చూస్తే మినీ రోహిత్‌ను చూసినట్లే ఉంది. గిల్ బ్యాటింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు ఆడుతున్నాడు. రానురాను మరింత మెరుగవుతాడు. గిల్ తన బ్యాటింగ్‌ను పెద్దగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవలే అతడు డబుల్ సెంచరీ కూడా బాదాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ అద్భుతంగా సాగుతోంది. రోహిత్ లాంటి టాప్ బ్యాటర్ ఆ టీమ్‌లో ఉన్నాడు. హుక్, పుల్ షాట్లను అలవోకగా కొట్టడంలో అతడు దిట్ట. అందుకే రెండో మ్యాచులో 108 పరుగుల టార్గెట్‌ను భారత్ సులువుగా ఛేదించింది. అయితే భారత బ్యాటింగ్‌లో ఓ లోపాన్ని గమనించా. టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఆడుతున్నప్పుడు ఫ్రంట్ ఫుట్ బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తోంది. పైకి వస్తున్న బంతులను ఆడేందుకు డిఫెన్సివ్ అప్రోచ్‌ను ఎంచుకుంటే బెటర్. టెస్టు, వన్డే క్రికెట్ ఫార్మాట్లలో టీమిండియా పునరుజ్జీవం పొందాలంటే బౌలింగ్ ఆధారమని అర్థం చేసుకోవాలి’ అని రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు.