బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న టీమిండియా వన్డే, టెస్టు సిరీస్ లను ముగించుకుంది. ఇక వన్డే సిరీస్ ను 2-1తో కోల్పోయిన భారత్ దారుణంగా విమర్శలు ఎదుర్కొంది. దాంతో టెస్ట్ సిరీస్ ను ఎలాగైనా గెలిచి, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. అందుకు తగ్గట్లుగా తొలి టెస్టులో అద్భుత విజయాన్ని సాధించింది. ఇక రెండో టెస్ట్ లో మాత్రం టీమిండియా తడబడిందనే చెప్పాలి. విజయం అయితే సాధించింది కానీ అది చెప్పుకోదగ్గ విజయం కాదు అంటున్నారు క్రీడా విశ్లేషకులు. 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి 7 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. దాంతో టీమిండియా ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గాయంతో టెస్ట్ సిరీస్ కు దూరమైన రోహిత్ జట్టులోకి వస్తే.. ఆ స్టార్ ఆటగాడు తప్పుకోక తప్పదు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.
బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టులో భారత్ చావు తప్పి కన్ను లొట్టపోయిన చందనంగా గెలిచింది. కేవలం 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు బంగ్లా బౌలర్లు చుక్కలు చూపించారు. తొలుత 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆదుకుంటారు అనుకున్న బ్యాటర్ల అందరు చేతులెత్తేశారు. దాంతో 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉంది భారత్. అప్పుడు క్రీజ్ లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్-రవిచంద్రన్ అశ్విన్ లు 8వ వికెట్ కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాకు విజయాన్ని అందించారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా ఆటతీరుపై, జట్టులో కేఎల్ రాహుల్ స్థానంపై మాట్లాడాడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.
బంగ్లాతో చివరి వన్డేలో బొటన వేలి గాయంతో టెస్ట్ సిరీస్ కు దూరం అయ్యాడు రోహిత్. దాంతో కెప్టెన్సీ పగ్గాలను చేపట్టాడు రాహుల్. ఇక రాహుల్ గత కొంత కాలంగా కంటిన్యూస్ గా పరుగులు చేయడంలో విఫలం అవుతూ.. వస్తున్నాడు. అయితే రోహిత్ తిరిగి జట్టులోకి వస్తే కచ్చితంగా రాహుల్ ను పక్కనపెట్టడం ఖాయం అని జాఫర్ అన్నాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ నాటికి రోహిత్ కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే అందరు శుభ్ మన్ గిల్ ను పక్కన పెడతారు అని అనుకోవచ్చని, కానీ గిల్ తాజాగా జరిగిన మ్యాచ్ లో సెంచరీతో ఆకట్టుకోవడంతో అతడిని పక్కన ఎలా పెడతారని జాఫర్ ప్రశ్నించాడు.
ఇక ఈ మ్యాచ్ లో భారత ఆటగాళ్లపై ఆటతీరుపై తీవ్రంగా మండిపడ్డాడు జాఫర్. అసలు ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ ఎందుకు అంత డిఫెన్సీవ్ గా ఉందో అర్థం కాలేదు, లక్ష్యం తక్కువ కాబట్టి మరింత అగ్రెసివ్ గా ఆడుతారని అంతా భావించారు కానీ జరింది వేరని జాఫర్ చెప్పుకొచ్చాడు. డిఫెన్స్ ఆడితే పరుగులు అంత ఈజీగా రావు అని జాఫర్ పేర్కొన్నాడు. ఇక గిల్ కూడా తొలి మ్యాచ్ లో ఆడిన విధానంగానే ఆడుతాడని అనుకుంటే.. అందుకు విరుద్దంగా ఆడాడు అంటూ జాఫర్ పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది అంతా రాహుల్ దారుణంగా విఫలం అయ్యాడు. ఈ సంవత్సరం మెుత్తం నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడిన రాహుల్.. 17.13 సగటుతో కేవలం 137 పరుగులు మాత్రమే సాధించాడు. టీ20ల్లో సైతం నెమ్మదిగా బ్యాటింగ్ చేసి విమర్శల పాలైయ్యాడు కేఎల్ రాహుల్.