ప్రపంచ క్రీడాలోకంలో భారత్ – పాక్ క్రికెట్ మ్యాచ్ కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర జట్లకు లేదన్నది కాదనలేని వాస్తవం. ఎప్పుడు ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన ఓ మినీ యుద్ధాన్నే తలపిస్తుంది. ఇక మ్యాచ్ కు ముందు పాక్ ఆటగాళ్లు, పాక్ మాజీ దిగ్గజాలు టీమిండియాపై మాటలతో విరుచుకుపడటం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ తాజాగా టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో పరాజయం పాలైంది. దాంతో తన నోటికి పనిచెప్పాడు పాక్ మాజీ బౌలింగ్ దిగ్గజం షోయబ్ అక్తర్. టీమిండియా బౌలింగ్ పై, టీమ్ పై విమర్శలు గుప్పించాడు. ఇక ఫైనల్లో పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్ పై ఘోర పరాభవం చెందింది. దాంతో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ అక్తర్ ట్వీట్స్ కు ధీటైన కౌంటర్ ఇచ్చిన సంగతి మనందరికి తెలిసిందే. ఇక ఈ ట్విట్టర్ వార్ ఆపండి అంటూ పాక్ దిగ్గజాలు అయిన వసీమ్ అక్రమ్, అఫ్రిదీ, మిస్బాహుల్ హక్ లు రంగంలోకి దిగారు.
టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీస్ ఓడిపోవడంతో పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తన నోటికి పనిచెప్పాడు. ట్విట్టర్ వేదికగా టీమిండియాపై విమర్శలు గుప్పించాడు. అనంతరం ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో పాక్ ఓడిపోవడంతో అక్తర్ కు “సారీ బ్రదర్ కర్మ అంటే ఇదే” అంటూ ఎపిక్ రిప్లై ఇచ్చాడు టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా ఓ మినీ యుద్దమే జరిగింది. ఒకరికి ఒకరు ఘాటుగా సమాధానాలు ఇచ్చుకోవడంతో వాతావరణం వేడెక్కింది. దాంతో రంగంలోకి దిగారు పాక్ మాజీ ఆటగాళ్లు. సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకోవద్దు అంటూ ఇద్దరిని అభ్యర్థించారు. ”భారత ప్లేయర్స్ కు వారి దేశంపై అమితమైన దేశభక్తి ఉంటుంది. ఆ విషయం ప్రపంచానికి మెుత్తం తెలుసు. ఇక మనకూ మన దేశంపై ప్రేమ ఉంటుంది. మనం చేసే వ్యాఖ్యలు, ట్వీట్స్ పాజిటీవ్ గా ఉండాలి. మాజీ ఆటగాళ్లైనా, ఇప్పుడు ఆడుతున్న వారు అయినా భారత్-పాక్ ప్లేయర్స్ కలిసి ఉండేలా చూడాలి. అంతేకానీ అగ్నికి ఆజ్యాం పోసేలా ట్వీట్స్ చేయెుద్దు” అంటూ పాక్ మాజీ కెప్టెన్, బౌలింగ్ దిగ్గజం వసీమ్ అక్రమ్ పేర్కొన్నాడు.
Sorry brother
It’s call karma 💔💔💔 https://t.co/DpaIliRYkd
— Mohammad Shami (@MdShami11) November 13, 2022
ఇక మరో ఆటగాడు అయిన షాహిద్ అఫ్రిదీ ఈ వివాదంపై స్పందిస్తూ..”భారత్-పాక్ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను ఆపేందుకు మనం నిరంతరం కృషి చేయాలి. క్రికెట్ ఆటగాళ్లుగా మనమంతా రాయబారులం. అంతేకానీ ఇలా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఇలా ట్వీట్స్ చేయరాదు” అంటూ పేర్కొన్నాడు. మిస్బా ఉల్ హక్ సైతం స్పందిస్తూ..”భారత్-పాక్ ఆటగాళ్లే కాదు మరే ఇతర దేశ ఆటగాళ్లైనా మనమంతా ఒకే ఫ్యామిలీ. కేవలం లైక్స్ కోసం మీరు ఇలాంటివి చేయకండి. ఇతరుల అభిప్రాయాలకు మీరు గౌరవం ఇవ్వాలి” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక షోయబ్ అక్తర్ విషయానికి వస్తే.. టీమిండియాపై సమయం చిక్కినప్పుడల్లా తన అక్కసును వెళ్లగక్కుతూ ఉంటాడు. అంతే ధీటుగా భారత ఆటగాళ్లు సైతం సమాధానాలు ఇస్తుంటారు.