గత 15 ఏళ్లుగా టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు విరాట్ కోహ్లీ. ఈ నేపథ్యంలో స్వదేశంలో జరగబోయే వరల్డ్ కప్ మీద అభిమానులు ఈ స్టార్ ఆటగాడిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే భారత మాజీ క్రికెటర్ మాత్రం విరాట్ కోసం కప్ గెలవాలని చెబుతున్నాడు.
ఐసీసీ టోర్నీ గెలిచి 10 ఏళ్ళు దాటింది. వరల్డ్ కప్ కొట్టి 12 ఏళ్ళు అవుతుంది. ద్వైపాక్షిక సిరీస్ లో అదరగొడుతూ వస్తున్న టీమిండియా ఐసీసీ టోర్నీలు గెలవడంతో మాత్రం విఫలమవుతుంది. నాకౌట్ బలహీనతను దాటలేక చతికిలపడుతుంది. ప్రతిసారి ఇలాగే జరుగుతుండడంతో అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ సారి మాత్రం స్వదేశంలో వరల్డ్ కప్ జరగనుండడం మన ఇండియాకు కలిసి వస్తుందనే చెప్పాలి. దీంతో మరోసారి అభిమానుల అంచనాలు ఎక్కువయ్యాయి. అంతే కాదు కొంత మంది టీమిండియా ప్లేయర్లకి ఇదే చివరి వరల్డ్ కానుంది. ముఖ్యంగా లెజెండరీ విరాట్ కోహ్లీకి ఇదే చివరి వరల్డ్ కప్ అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లీ కోసం కప్ గెలవాలి అంటున్నాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.
భారత్ వేదికగా అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మీద భారీ అభిమానులు అంచనాలే పెట్టుకున్నారు. అయితే కోహ్లీని ఎలాంటి ఒత్తిడికి గురి చేయొద్దని సెహ్వాగ్ తెలియజేశాడు. తాజాగా ఒక సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సెహ్వాగ్ మాట్లాడుతూ.. “మైదానంలో దిగిన ప్రతిసారీ కోహ్లీ 100 శాతం ఎఫర్ట్ ఇస్తాడు. ఈ వరల్డ్ కప్‌లో పిచ్‌లు కూడా అతని బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయి. మేము 2011లో సచిన్ కోసం వరల్డ్ కప్‌లో రాణించాము. ఇప్పుడు కూడా భారత్ అదే చేయాలి. మేం సచిన్ కోసం వరల్డ్ కప్ ఆడాం. మేం వరల్డ్ కప్ గెలిస్తే సచిన్‌కు అది గొప్ప వీడ్కోలు అవుతుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా సేమ్. అందరూ కూడా అతని కోసం వరల్డ్ కప్ గెలవాలని ఆడతారు. తను మైదానంలో ఎప్పుడూ వందకు అంతకన్నా ఎక్కువే కష్టపడతాడు’ అని సెహ్వాగ్ తెలియజేశాడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ విండీస్ టూర్ కి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సిరీస్ తర్వాత ఆసియా కప్, వరల్డ్ కప్ మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీ ఎలా రాణిస్తాడనే దానిపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక తాజాగా వరల్డ్ కప్ షెడ్యూల్ ని కూడా ఐసీసీ విడుదల చేసింది. అక్టోబర్ 15 న ప్రారంభం కానున్న ఈ టోర్నీ.. నవంబర్ 19 న ముగుస్తుంది. పదేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ టైటిల్ ని ఈ సారి టీమిండియా గెలుస్తుందో లేదో చూడాలి. మొత్తానికి సెహ్వాగ్ చెప్పినట్లుగా విరాట్ కోహ్లీకి టీమిండియా సమిష్టిగా ఆడి కప్ అందిస్తారేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.