భారతదేశంలో క్రికెట్ కు ఉండే ఆదరణ, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెటర్లను అభిమానులే కాదు.. భక్తులు కూడా ఉంటారు. అయితే అలాంటి క్రికెటర్లు ఇప్పుడు తరచూ గాయపడుతూ ఆటకు దూరమవుతున్నారు.
వీరేంద్ర సెహ్వాగ్.. క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. ఇండియన్ క్రికెట్ కోసం ఎంతో కృషి చేశాడు. క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. అయితే సెహ్వాగ్ ఆటగాడు మాత్రమే కాదు.. గొప్ప మాటకారి కూడా. నెట్టింట సెటైరిక్ ట్వీట్లతో ఆకట్టుకుంటూ ఉంటాడు. సెహ్వాగ్ చాలా తక్కువ సమయాల్లో సీరియస్ అవుతూ ఉంటాడు. తాజాగా టీమిండియా క్రికెటర్లపై సెహ్వాగ్ సీరియస్ అయ్యాడు. నిజానికి సెహ్వాగ్ ఇలా మాట్లాడటం ఎప్పుడూ చూసుండరు. టీమిండియా క్రికెటర్లు చాలా మంది వరుసగా గాయాలపాలవ్వడం, కోలుకున్న తర్వాత కూడా మళ్లీ ఆస్పత్రి పాలు కావడంపై సెహ్వాగ్ తనదైనశైలిలో స్పందించాడు. అసలు క్రికెటర్లకు వెయిట్ లిఫ్టింగ్ తో పనేంటని సూటిగా ప్రశ్నించాడు. క్రికెటర్లు అంతా మైదానంలో కంటే.. జిమ్ లోనే ఎక్కువ దెబ్బలు తగిలించుకుంటున్నారని వ్యాఖ్యానించాడు.
సెహ్వాగ్ తాజాగా యూట్యూబర్ ది రన్వీర్ షోలో పాల్గొన్నాడు. ఇంటర్వూలో భాగంగా మాట్లాడుతూ టీమిండియా క్రికెటర్లు తరచూ గాయాలపాలు కావడంపై సెహ్వాగ్ సీరియస్ అయ్యాడు. తమ రోజుల్లో పరిస్థితులను గుర్తుచేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు క్రికెటర్లు గంటల తరబడి జిమ్ చేయడం దేనికి? తమ శక్తిమించి వెయిట్ లిఫ్టర్ల తరహాలో బరువులు ఎత్తాల్సిన అవసరం ఏంటి? అంటూ పలు ప్రశ్నలు సంధించాడు. అధిక బరువులు ఎత్తే బదులు మైదానంలో ఆట ప్రాక్టీస్ చేయచ్చు కదా అని ప్రశ్నించాడు. బరువులు ఎత్తడం వల్ల క్రికెటర్లకు అదనంగా ప్రయోజనం కలగకపోగా.. కొత్త సమస్యలు రావడం, గాయాల పాలు కావడం జరుగుతుందని హెచ్చరించాడు. అధిక బరువులు ఎత్తడం వల్లే ఆటగాళ్లు వెన్నునొప్ప బారిన పడుతున్నారని తెలిపాడు.
“నేను క్రికెట్ ఆడే సమయంలో సచిన్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్, గంభీర్, ధోనీ, యువీ, ఆకాశ్ చోప్రా ఇలా మేము ఎవ్వరం వెన్నునొప్పికి గురి కాలేదు. మాకు కనీసం తొడ కండరాలు కూడా పట్టుకోలేదు. అలాంటి గాయాల కారణంగా ఒక్క రోజు కూడా ఆటకు మేం దూరం కాలేదు. ఇప్పుడు మాత్రం.. కేఎల్ రాహుల్, అయ్యర్, రోహిత్, హార్దిక్ పాండ్యా ఇలా ప్రతీ క్రికెటర్ వెన్నునొప్పి బాధితులే. వీళ్లు అందరూ గ్రౌండ్ లో కంటే జిమ్ లోనే ఎక్కువ సమయం గడుపుతారు. వీళ్లకి గాయాలు కూడా జిమ్ లోనే అయ్యాయి. ఆటగాళ్లు ఫిట్ నెస్ పెంచుకోవడంలో తప్పులేదు. కానీ, వారి శరీర తత్వానికి తగిన ఎక్సర్ సైజ్ లు ఎంచుకోవాలి. విరాట్ కోహ్లీ గంటల తరబడి జిమ్ లో సమయం గడుపుతాడని అందరూ అతనిలా బరువులు ఎత్తాలి అనుకోకూడదు. మీ ఆటకు తగిన వ్యాయామాన్ని మీరు ఎంచుకోవాలి” అంటూ సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.