టీమిండియా బెస్ట్ ఓపెనింగ్ జోడీల్లో సచిన్-సెహ్వాగ్లది ఒకటిగా చెప్పొచ్చు. వీరిద్దరూ బ్యాటింగ్ చేస్తుంటే ప్రత్యర్థి బౌలర్లు హడలిపోయేవారు. ఫోర్లు, సిక్సులతో బౌలర్లను ఊచకోత కోసేవారు. అలాంటి వీరికి మధ్య ఒక ఆసక్తికర సంఘటన జరిగిందట. దాని గురించి వీరూ ఏమన్నాడంటే..!
భారత క్రికెట్లో డాషింగ్ బ్యాట్స్‌మన్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది వీరేంద్ర సెహ్వాగ్. ఏ బౌలర్, ఏ ఫార్మాట్, ఎక్కడ ఆడుతున్నాం అనేది పట్టించుకోకుండా చెలరేగడం వీరేంద్రుడికి వెన్నతో పెట్టిన విద్య. మహామహా బౌలర్లను కూడా తన బ్యాటింగ్ విధ్వంసంతో ఊచకోత కోశాడతడు. సాధారణంగా ఏ బ్యాట్స్‌మన్ అయినా సెంచరీకి చేరువైతే మెళ్లిగా ఆడతాడు. కానీ వీరూ మాత్రం శతకానికి చేరువైనా హిట్టింగ్ ఆపడు. ఫోర్ లేదా సిక్స్ కొట్టి సెంచరీని పూర్తి చేసుకుంటాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను ఆదర్శంగా తీసుకుని టీమిండియాలోకి అడుగు పెట్టిన సెహ్వాగ్.. తన ఆరాధ్య క్రికెట్ దైవంతో కలసి ఓపెనింగ్ స్థానాన్ని పంచుకున్నాడు. సచిన్‌తో కలసి భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు.
సొంతగడ్డ మీద 2011 వన్డే వరల్డ్ కప్‌ను భారత్ సొంతం చేసుకోవడంలోనూ సచిన్-సెహ్వాగ్‌లు కీలక పాత్ర పోషించారు. మైదానంతో పాటు బయట కూడా వీళ్లిద్దరూ మంచి స్నేహితులు. ఈ విషయం అనేక సందర్భాల్లో రుజువైంది. అయితే, 2011 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా సచిన్‌తో జరిగిన ఒక సరదా సంఘటనను వీరూ స్టార్ స్పోర్ట్స్ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. బ్యాటింగ్ చేసే సమయంలో పాటలు పాడటం సెహ్వాగ్‌కు అలవాటు. అయితే ఆ ప్రపంచ కప్‌లో ఈ అలవాటు సచిన్‌కు చిరాకు తెప్పించిందట. అంతేకాకుండా మాస్టర్ బ్యాట్‌తో తనను సరదాగా కొట్టాడని వీరూ చెప్పుకొచ్చాడు.
‘మేం 2011 వన్డే ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడుతున్నాం. నేను బ్యాటింగ్ చేస్తూ యథాలాపంగా పాటలు పాడుతున్నాను. ఈ సమయంలో సచిన్ టెండూల్కర్ కూడా మంచి టచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. సచిన్‌కు ఓవర్ల మధ్య మాట్లాడే అలవాటు ఉంది. కానీ నేను మాత్రం అస్సలు మాట్లాడను. నేను ఏకాగ్రత పొందేందుకు పాటలు పాడుతూ ఉంటాను. అలా ఫస్ట్ మూడు ఓవర్ల పాటు జరిగింది. నాలుగో ఓవర్ తర్వాత మాస్టర్ నా వెనుక నుంచి వచ్చి నన్ను తన బ్యాట్‌తో సరదాగా కొట్టాడు. నువ్విలా కిషోర్ కుమార్లా పాటలు పాడుతూ ఉంటే నేను పిచ్చివాడ్ని అయిపోతానని చెప్పాడు’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. కాగా, సౌతాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్‌లో వీరూ-సచిన్‌లు తొలి వికెట్‌కు 142 రన్స్ భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా అనూహ్యంగా ఓటమిపాలైంది.
A never-heard-before story from Sehwag#Sehwag #Tendulkar #SachinTendulkar #TeamIndia https://t.co/B8Qy9hoikD
— HT Sports (@HTSportsNews) April 12, 2023