ప్రస్తుత క్రికెట్లో సచిన్ 100 సెంచరీల రికార్డ్ ను ఎవరు బద్దలు కొడతారు? ఇక ఈ ప్రశ్నకు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సమాధానం చెప్తూ.. ఆ ఆటగాడే సచిన్ రికార్డును బద్దలు కొడతాడని, ఏకంగా 110 సెంచరీలు చేస్తాడని జోస్యం చెప్పాడు.
ప్రస్తుత క్రికెట్లో సచిన్ 100 సెంచరీల రికార్డ్ ఎవరు బద్దలు కొడతారు? ఈ ప్రశ్నకు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పేరు చెప్పడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేనట్టే కనిపిస్తుంది. ఫామ్, ఫిట్ నెస్, టాలెంట్ ఇలా ఏ విషయంలోనైనా సచిన్ 100 సెంచరీల రికార్డ్ బ్రేక్ చేయాలంటే అది కేవలం కోహ్లీకి మాత్రమే సాధ్యమవుతుంది. సచిన్(100) తర్వాత.. 75 సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే సచిన్ రికార్డ్ ఎవరు బ్రేక్ చేస్తారు అని అడగడం మానేసి.. విరాట్ కోహ్లీ సచిన్ రికార్డ్ బ్రేక్ చేస్తాడా? లేదా? అని అడిగితే సరిపోతుంది. ఎందుకంటే ప్రస్తుత తరం క్రికెటర్లలో సచిన్ కి సమీపంలో ఉంది కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే. ఈ లిస్టులో ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (45) ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (45) కోహ్లీకంటే చాలా వెనుక బడి ఉన్నారు.
ఈ నేపథ్యంలో క్రికెట్ గాడ్ సచిన్ అంతర్జాతీయ క్రికెట్లో నమోదు చేసిన సెంచరీల రికార్డ్ విరాట్ కోహ్లీ అధిగమిస్తాడని చాలామంది అభిమానులతోపాటు.. క్రీడా పండితులు, విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కోహ్లీ ఏకంగా 110 సెంచరీలు చేస్తాడని జోస్యం చెప్పాడు. గత 3 సంవత్సరాలుగా కోహ్లీ ఫామ్ ఏమంత గొప్పగా లేదు. కోవిడ్ కారణంగా మ్యాచులు తగ్గిపోవడం, ద్వైపాక్షిక సిరీస్ లో కోహ్లీకి ఎక్కువగా రెస్టు ఇవ్వడం, ఆడిన మ్యాచుల్లో కూడా విఫలమవ్వడం లాంటి కారణాలు.. కోహ్లీని దాదాపు 3 సంవత్సరాలుగా సెంచరీ నుండి దూరం చేసాయి. దీంతో కోహ్లీ సెంచరీల సంఖ్య 71 వద్దే ఆగిపోయింది. అయితే 2022 ఆసియా కప్ టీ20 లో ఆఫ్ఘనిస్తాన్ మీద సెంచరీ తర్వాత.. కోహ్లీ తన పూర్వవైభవాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ క్రమంలో వన్డే, టెస్టు ఫార్మాట్ లో కూడా సెంచరీ చేసి పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ వరుసబెట్టి సెంచరీలు చేస్తుండగా పాకిస్థాన్ పేసర్ అక్తర్.. కోహ్లీ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.
పాకిస్థాన్ క్రికెటర్ అయినా.. ఏ మాత్రం ఈగోకి వెళ్లకుండా కింగ్ కోహ్లీ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఇప్పటికే చాలామంది పాకిస్థాన్ అభిమానులు, విశ్లేషకులు కోహ్లీ రికార్డ్ లను బాబర్ అజామ్ బ్రేక్ చేస్తాడని చెప్పుకొచ్చారు. కానీ అక్తర్ మాత్రం ఈ విషయంలో భిన్నంగా స్పందించి కోహ్లీని ఆకాశానికెత్తేసాడు. ఈ సందర్భంగా అక్తర్ మాట్లాడుతూ.. “విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. అయితే ఇది అతడికి కొత్తేమి కాదు. గతంలో కెప్టెన్సీ చేస్తుండగా తీవ్ర ఒత్తిడిలో పూర్తి స్థాయి బ్యాటింగ్ చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక మీద నుండి కోహ్లీ మరింత ఫోకస్ గా ఆడతాడు. సచిన్ సెంచరీల రికార్డ్ అధిగమించడమే కాదు 110 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో కోహ్లీ నిలుస్తాడు. ఇక నుంచి బీస్ట్ లా పరుగుల వేటలో దూసుకెళ్తాడు”.అని అక్తర్ తెలియజేశాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో 75 సెంచరీలు చేసిన కోహ్లీ.. మరో 26 సెంచరీలు చేస్తే సచిన్ రికార్డ్ ని అధిగమించి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం కోహ్లీ వన్డేల్లో 46, టెస్టుల్లో 28, టీ20 ల్లో ఒక సెంచరీ చేసాడు. మరో 3 సంవత్సరాలు కోహ్లీ గనుక ఇలాంటి ఫామ్ నే కొనసాగిస్తే సచిన్ 100 సెంచరీల రికార్డ్ అధిగమించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. మరి విరాట్ కోహ్లీ క్రికెట్ గాడ్ సచిన్ 100 సెంచరీల రికార్డ్ ను బ్రేక్ చేస్తాడా? లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.