క్రికెటర్లను ఎంతగానో ఇష్టపడే అభిమానులు వారు వేసుకునే జెర్సీ నంబర్ల మీద కూడా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కొన్ని జెర్సీ నంబర్ల వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జెర్సీ వెనుక ఓ ఎమోషనల్ స్టోరీ ఉంది. అదేంటో తెలుసుకుందాం..
క్రికెటర్లు ఎంత ఫేమసో వారి జెర్సీలు కూడా అంతే పాపులర్. ఉదాహరణకు సచిన్ టెండూల్కర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ‘జెర్సీ నంబర్ 10’. తమ ఫేవరెట్ ప్లేయర్లు వేసుకునే జెర్సీలు అంటే అభిమానులు కూడా తెగ ఇష్టపడతారు. ఆ నంబర్ టీ-షర్టులు దొరికితే వేసుకోవడాన్ని చూస్తూనే ఉన్నాం. ఇక, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పేరు వినగానే.. క్రికెట్ ఫ్యాన్స్‌కు ‘జెర్సీ నంబర్ 18’ కళ్ల ముందు అలా కదలాడుతుంది. ఐపీఎల్‌తో పాటు ఇంటర్నేషన్ టోర్నీల్లోనూ విరాట్ ఆ జెర్సీ నంబరులోనే కనిపిస్తాడు. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా కింగ్ ఈ సంఖ్యను మార్చుకోలేదు. అయితే దీని వెనుక ఓ ఎమోషనల్ స్టోరీ ఉంది. తన తండ్రి గుర్తుగా ‘నంబర్ 18’ జెర్సీని వేసుకుంటున్నాడు కోహ్లీ.
కోహ్లీ 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అతడి తండ్రి ప్రేమ్ కోహ్లీ చనిపోయారు. 2006 డిసెంబర్ 18వ తేదీన గుండెపోటుతో ప్రేమ్ మరణించారు. ఆ సమయంలో ఢిల్లీ తరఫున కర్ణాటకతో విరాట్ ఓ రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. తండ్రి చనిపోయినా.. కుటుంబ సభ్యులు అండగా నిలబడటంతో దుఃఖాన్ని దిగమింగుకుని విరాట్ ఆ మ్యాచ్ ఆడాడు. అంతేకాదు మ్యాచ్‌లో ఏకంగా 90 రన్స్ చేశాడు. మ్యాచ్ ముగిశాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఆ రోజు తాను వ్యక్తిగా మారానని నాటి రోజుల్ని గుర్తుచేసుకున్నాడు విరాట్. అందుకే తండ్రిని కోల్పోయిన రోజు గుర్తుగా జెర్సీ నంబర్ 18ని సెలెక్ట్ చేసుకున్నాడు. అండర్-19 టీమ్‌లో చేరినప్పుడు తొలుత విరాట్ కోహ్లీకి జెర్సీ నంబరు 44ను మేనేజ్మెంట్ కేటాయించింది.
ఆ తర్వాత కొన్నాళ్లకు విరాట్ జెర్సీ నంబరు 18కి మారాడు. అదే నంబరుతో అండర్ 19 టీమ్‌కు కెప్టెన్‌గా టీమిండియాకు వరల్డ్‌కప్ కూడా అందించాడు. ఆ తర్వాత అదే ఆటతీరును కొనసాగిస్తూ భారత సీనియర్ జట్టు తలుపులు తట్టాడు. టీమిండియాలో విరాట్ కోహ్లీ చేరేనాటికి అదృష్టవశాత్తూ ‘జెర్సీ నంబరు 18’ ఖాళీగా ఉంది. దీంతో ఎలాంటి సమస్యలు లేకుండా కోహ్లీకి ఆ నంబరు జెర్సీ దక్కింది. అప్పటి నుంచి అతడు అదే నంబరుతో తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ నంబరుకు మరో స్పెషాలిటీ కూడా ఉందట. విరాట్ తండ్రి ప్రేమ్ తాను క్రికెట్ ఆడే రోజుల్లో ‘జెర్సీ నంబరు 18’నే వేసుకునేవారట. ఆయన జ్ఞాపకార్థం కోహ్లీ కూడా అదే నంబరు జెర్సీతో ఆడుతుండటం గమనార్హం. మరో విషయం ఏంటంటే.. విరాట్ టీమిండియాకు ఆడిన తొలి మ్యాచ్ తేదీ ఆగస్టు 18లో కూడా అతడు వేసుకునే జెర్సీ నంబర్ ఉండటం విశేషం.
Virat Kohli on his Jersey no 18🤌❤️#viratkohli #One8Run pic.twitter.com/jLMcqF5y0S
— ft.wrogn18 (@Imlakshay_18) March 26, 2023