టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్ ప్రస్తుతం డౌన్ ఫాల్‌లో నడుస్తోంది. మంచి నీళ్లు తాగినంత సులభంగా సెంచరీలు బాదిన ఈ రన్ మెషీన్ ప్రస్తుతం పరుగులు చేసేందుకు మొరాయిస్తోంది. విరాట్ కోహ్లీ సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు అవుతుందంటేనే అతను ఎలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. సెంచరీలు మీద సెంచరీలు చేసి సచిన్ 100 సెంచరీల రికార్డును బద్దలు కొట్టే ఒకే ఒక్కడిగా కోహ్లీని చూసిన వారు.. ఇప్పుడు ఆడుతున్నది మనం చూసిన కోహ్లీనేనా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కవర్ డ్రైవ్‌లను కొలతపెట్టి మరీ కొట్టే కోహ్లీ నుంచి మళ్లీ అలాంటి పర్ఫెక‌్షన్ కోసం అతని అభిమానులు కళ్లల్లో ఒత్తులేసుకుని చూస్తున్నారు. ఫీల్డింగ్‌లో కోహ్లీ ఎనర్జీ ఏమాత్రం తగ్గడంలేదు కానీ.. బ్యాటింగ్‌లో మునుపటి కోహ్లీని మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ మిస్ అవుతున్నారనే చెప్పాలి. 2014లో ధోని తర్వాత టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కోహ్లీ.. జట్టును అద్భుతంగా నడిపించాడు. ఎగ్రెసివ్ క్రికెట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీని గుర్తుకు తెచ్చాడు. కెప్టెన్సీ తీసుకున్న తర్వాత నుంచి ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ శకం అని చెప్పుకోవచ్చు. అంతలా ఇండియన్ క్రికెట్‌ను శాసించాడు.
కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో తొలి సారి బీసీసీఐకు రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఈ నెల 22 నుంచి వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ నుంచి తనకు రెస్ట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న బ్యాడ్ ఫామ్‌నుంచి బయటపడేందుకు కొంత విశ్రాంతి అవసరమని కోహ్లీ భావించినట్లు తెలుస్తుంది. అందుకే వెస్టిండీస్ సిరీస్ నుంచి బ్రేక్ తీసుకునేందుకు కోహ్లీ బీసీసీఐకి రిక్వెస్ట్ లెటర్ పంపినట్లు సమాచారం. కొంత విరామం తీసుకుని మానసికంగా, శారీరకంగా కొత్త శక్తిని కూడగట్టుకోని తన సత్తా చాటాలని కోహ్లీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.