మరో రెండు రోజుల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నెల 9న నాగ్‌పూర్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. అయితే.. ఈ కీలక టెస్టు సిరీస్‌కి ముందు టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాపై దుమ్మురేపేందుకు కోహ్లీ నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుంటే.. ఈ గ్యాప్‌లో కోహ్లీ కొత్త ఫోన్‌ను ఎవరో కొట్టేశారు. భారీ సెక్యూరిటీ మధ్య ఉన్న ఆటగాళ్లు.. వారి వస్తువులకు మాత్రం భద్రత లేకుండా పోయింది.
తన ఫోన్ పోయిన విషయాన్ని కోహ్లీనే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపాడు. ‘కొత్త ఫోన్ పోతే అందులోనూ ఇంకా బాక్స్ నుంచి తెరవని ఫోన్ పోతే ఎంతో బాధగా అనిపిస్తుంది. నా ఫోన్ ఎవరికైనా దొరికిందా?’ అంటూ కోహ్లీ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. గతంలోనూ ఒక సారి కోహ్లీ ఉండే హోటల్ రూమ్‌లోకి హోటల్ సిబ్బంది వెళ్లి వీడియో తీసిన సంఘటన ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. ఆ విషయంలో కోహ్లీ సైతం సీరియస్‌గానే స్పందించాడు. తమపై అభిమానులకు ఇష్టం ఉండొచ్చని కానీ.. తమ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసేంత ఇష్టం వద్దని, తమ ప్రైవసీని గౌరవించాలని కోరాడు. ఇప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఆటగాళ్లకు చెందిన విలువైన వస్తువులు సైతం కనిపించకపోవడం భద్రతా వైఫల్యంగానే చూడాలి.
మహా అయితే ఒక లక్ష రుపాయాల ఫోన్ పోయి ఉండొచ్చని అనుకోవచ్చు. అది కోహ్లీకి పెద్ద అమౌంట్ కాదులే అని భావించవచ్చు. కానీ.. వస్తువు విలువ గురించి కంటే.. వారి భద్రత విషయం గురించే ఇక్కడ ఎక్కువ ఆలోచించాలి. ఇంకా వాడని కొత్త ఫోన్ పోయింది కాబట్టి పర్లేదు. అదే ప్రస్తుతం కోహ్లీ వాడుతున్న ఫోన్ పోయి ఉంటే.. అందులో ఉండే అతని వ్యక్తిగత సమాచారం అంతా దొంగిలించబడేది. మరి ఈ విషయంలో హోటల్ సిబ్బంది ఎలాంటి చర్చలు తీసుకుంటారో? కోహ్లీ ఫోన్ దొరుకుంతుందో లేదో చూడాలి. కాగా.. ఫోన్ సంగతి ఎలా ఉన్నా.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో మాత్రం కోహ్లీ బాగా రాణించాలని అతని అభిమానులతో పాటు.. యావత్ భారత దేశ క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Nothing beats the sad feeling of losing your new phone without even unboxing it ☹️ Has anyone seen it?
— Virat Kohli (@imVkohli) February 7, 2023