భారత్, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ అంటే అభిమానులే కాదు.. ఆటగాళ్లకు కూడా అదోరకమైన ఉత్సాహం ఉంటుంది. ‘లగాన్’ సినిమా మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తుంటుంది. ఒకప్పటి భారత క్రికెట్‌లో ప్రత్యర్థి ఆటగాడు రెచ్చగొడితే మనవాళ్లు బాల్, బ్యాటుకు మాత్రమే పని చెప్పేవారు. బౌలర్ అయితే వికెట్ తీసి నోరు మూపించడం.. బ్యాట్స్ మెన్ అయితే బౌండ్రీ బాది నోటి మీద వేలు వేయించేవారు. కానీ, రోజులు మారాయి. ఇప్పటి టీమిండియా అయితే చేతలే కాదు, మాటలతోనూ ప్రత్యర్థి జట్లకు చెమటలు పట్టిస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న భారత్- ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆటగాళ్లే కాదు, అభిమానులు కూడా రెచ్చిపోతూనే ఉంటారు. కానీ, ఈ సిరీస్‌లో మాత్రం యాక్షన్, రియాక్షన్ శ్రుతి మించుతున్నట్లు ఉంది. ఇదిలానే కొనసాగితే సిరీస్‌లో స్పోర్టివ్ స్పిరిట్ దెబ్బతింటుంది. అలాంటి ఘటనే మూడో టెస్టు ఆరంభానికి ముందు జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఘోర పరాభవం చవిచూసిన తర్వాత కోహ్లీ, రూట్‌ల మధ్య లాంగ్‌రూమ్‌లో గట్టి వాగ్వాదమే జరిగినట్లు తెలుస్తోంది. కోహ్లీ, రూట్ బాహాబాహికి దిగినట్లు టాక్. ఇరు జట్ల ఆటగాళ్లు గ్రూపులుగా విడిపోయి వ్యక్తిగత దాడుల వరకూ వెళ్లినట్లు బ్రిటిష్ మీడియా కథనాలు ప్రసారం చేసింది.
రెండో టెస్టులో రూట్ శతకం సాధించిన తర్వాత ఘర్షణకు బీజం పడినట్లు తెలుస్తోంది. చివరి బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన అండర్సన్‌ని లక్ష్యంగా చేసుకుని బుమ్రా షార్ట్ పిచ్ బంతులు విసిరిన సంగతి తెలిసిందే. బుమ్రా బంతులకు అండర్సన్ గాయలపాలయ్యాడు. అది మనసులో పెట్టుకుని అండర్సన్.. ఔటైన తర్వాత బుమ్రాను దుర్భాషలాడటంతో ఇరు జట్ల మధ్య చిన్నపాటి యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి మ్యాచ్ పూర్తయ్యేవరకూ ఇరు జట్ల మధ్య ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. చివరిగా ఫలితంగా మాత్రం 151 పరుగుల తేడాతో టీమిండియా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే.