టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్, ఛేజ్ మాస్టర్.. విరాట్ కోహ్లీ తన అభిమాన ఆటగాడి గురించి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం కోహ్లీ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. విరాట్ కోహ్లీ క్రికెట్ తర్వాత ఇష్టపడే మరో ఆట ఫుట్‌బాల్. మనదేశంలో ఫుట్‌బాల్‌కు పెద్దగా ఆదరణ లేకపోయినా.. మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే.. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్న కోహ్లీ.. పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు వీరాభిమాని. అతను ఆడే మ్యాచ్‌లను సైతం కోహ్లీ అప్పుడప్పుడు చూస్తుంటాడు. అయితే.. ప్రస్తుతం ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ జట్టు సెమీస్‌కు చేరలేకపోయింది.
క్వార్టర్ ఫైనల్స్‌లో ఆఫ్రికన్ కంట్రీ మొరాకో చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి తర్వాత తీవ్ర భావోద్వేగానికి గురైన రొనాల్డో గ్రౌండ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. పోర్చుగల్‌కు వరల్డ్ కప్ అందించడమే జీవితాశయంగా ఉన్న రొనాల్డో ఆ కల మరోసారి చెదిరిపోవడంతో.. తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ తర్వాత.. తన వరల్డ్ కప్ ఆశలు చచ్చిపోయినట్లు రొనాల్డో భారీ స్టేట్‌మెంట్ సైతం ఇచ్చాడు. అయితే.. రొనాల్డోను అభిమానించే కోహ్లీ.. సైతం అతని వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఒక గొప్ప ఆటగాడికి వరల్డ్ కప్‌లే కొలమానం కాదంటూ కోహ్లీ చేసి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘ఈ ఆటకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల కోసం నువ్వు చేసిన దానికి కంటే ఈ ట్రోఫీ లేదా ఈ టైటిల్ అంత తక్కువేవీ కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులపై నువ్వు చూపిన ప్రభావాన్ని ఏ టైటిల్ నిర్వచించలేదు. నువ్వు ఆడుతున్నప్పుడు నాతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అనుభూతి చెందారు. అది మాకు దేవుడిచ్చిన వరం. ప్రతి మ్యాచ్‌లోనూ ప్రాణం పెట్టి ఆడటమే గొప్ప ఆటగాడి లక్షణం. ఆట పట్ల నువ్వు చూపించే అంకితభావం ప్రతి క్రీడాకారుడికి నిజమైన ప్రేరణ. యూ ఆర్ మై గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ అంటూ కోహ్లీ పోస్ట్ చేశాడు. అయితే.. విరాట్ కోహ్లీ సైతం క్రికెట్‌లో దిగ్గజ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కోహ్లీ కెప్టెన్సీలో సైతం టీమిండియా వరల్డ్ కప్, ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదని బాధ కోహ్లీ అభిమానుల్లో సైతం ఉంది.