బంగ్లాదేశ్‌పై టీమిండియా బ్యాటర్లు ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ దుమ్మురేపారు. శనివారం జరిగిన మూడో వన్డేలో ఇషాన్ కిషన్ ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగగా.. కోహ్లీ సెంచరీతో సత్తా చాటాడు. వీరిద్దరి వీరవిహారంతో టీమిండియా 409 పరుగులు భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. టీమిండియాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే.. భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ కేవలం 3 పరుగులే చేసి.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లోనే అవుట్ అయ్యాడు. దీంతో.. 15 పరుగులకే టీమిండియా తొలి వికెట్‌ను కోల్పోయింది. దీంతో వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ.. ఇషాన్ కిషన్‌తో కలిసి.. ఇన్నింగ్స్‌ను నడిపించాడు. దూకుడుగా ఆడుతున్న కిషన్‌కు ఎక్కువగా స్ట్రైక్ ఇస్తూ.. తాను యాంకర్ రోల్ పోషించాడు. క్లిష్ట పరస్థితుల్లో భాగస్వామ్యాలు నిర్మించడంలో కోహ్లీకి మించినోరే లేరనే విషయం తెలిసిందే.
అదే విషయాన్ని మరోసారి నిరూపిస్తూ.. ఇషాన్ కిషన్‌తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో వేగంగా ఆడుతున్న ఇషాన్.. 85 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే మరింత వేగం పెంచి రాకెట్‌స్పీడ్‌తో 103 బంతుల్లోనే 150 మార్క్ అందుకున్నాడ ఇషాన్. ఆ లోపు కోహ్లీ సైతం ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. భారీ స్కోర్ దిశగా సాగుతున్న ఇషాన్ కిషన్‌కు కాస్త రెస్ట్ ఇస్తూ.. మధ్యలో కోహ్లీ సైతం ఎక్కువగా స్ట్రైక్ తీసుకుని వేగంగా ఆడి.. సెంచరీకి దగ్గరయ్యాడు. ఈ లోపు కాస్త ఊపిరి తీసుకున్న ఇషాన్.. చరిత్ర సృష్టించేందుకు సంసిద్ధమయ్యాడు. ఫోర్లు, సిక్సులతో బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన కెరీర్‌లో సెంచరీ లేకుండా డైరెక్ట్‌గా డబుల్ సెంచరీ కొట్టి ఇషాన్ చరిత్ర సృష్టించాడు.
ఈ ఆనందభరిత క్షణాలను ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో లెజెండరీ క్రికెటర్‌గా ఉన్న కోహ్లీతో పంచుకున్నాడు. అప్పుడెప్పుడో వీరేంద్ర సెహ్వాగ్ డబుల్ సెంచరీ చేస్తుంటే మరో ఎండ్‌లో ఉండి చూసిన కోహ్లీ.. మళ్లీ ఇన్నేళ్లకు అలాంటి ఇన్నింగ్స్‌ను చూశాడు. ఇషాన్ కిషన్ లాంటి యువ క్రికెటర్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌కు ఫిదా అయినా కోహ్లీ.. ఇషాన్ కిషన్ కంటే ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నాడు. బల్లే బల్లే డాన్స్ వేస్తూ.. మరీ ఇషాన్‌తో సంబురాలు జరుపుకున్నాడు. తన సక్సెస్ కంటే తోటి క్రికెటర్ల సక్సెస్‌ను ఎక్కువ ఎంజాయ్ చేసే కోహ్లీ.. మరోసారి తన నిస్వార్థ వ్యక్తిత్వాన్ని చూపించాడు. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీని పిచ్‌పైనే డాన్స్ సెలబ్రేట్ చేసుకుని తన గొప్పతాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ-ఇషాన్ కిషన్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మొత్తం మీద 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సులతో 210 పరుగులు చేసి కిషన్ అవుట్ అయ్యాడు. కొద్ది సేపటికే విరాట్ కోహ్లీ సైతం 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 113 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియా 409 పరుగుల భారీ స్కోర్‌ను బంగ్లా ముందు ఉంచింది. తొలి రెండు మ్యాచ్‌లో ఓడిన బాధలో ఉన్న టీమిండియాకు, అభిమానులకు వీరిద్దరి బ్యాటింగ్ కాస్త సంతోషాన్ని ఇచ్చింది.