ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారత టాప్ రెజ్లర్లు ధర్నాకు దిగడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో చాలా మంది ప్రముఖులు, సామాన్యులు స్పందిస్తున్నారు. రెజ్లర్లకు మద్దతు తెలుపుతూ, వారికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో టాప్ రెజ్లర్లు ధర్నా చేయడం హాట్ టాపిక్‌గా మారింది. క్రీడల్లో దేశం తరఫున నెత్తురోడేలా పోరాడి పతకాలు నెగ్గి, ఎంతో కీర్తి ప్రతిష్టలను అందించిన క్రీడాకారులు ధర్నా చేయడం ఆసక్తికరంగా మారింది. లైంగిక వేధింపులకు పాల్పడిన ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఛైర్మన్ బ్రిజ్ భూషన్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ దగ్గర రెజ్లర్లు ధర్నా తలపెట్టారు. మహిళా అథ్లెట్ల విషయంలో బ్రిజ్ భూషణ్ ప్రవర్తన సరిగ్గా లేదని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. రెజ్లర్ల ఆందోళనలకు అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. అయితే ఎంతో పాపులారిటీ, క్రేజ్ ఉన్న టీమిండియా క్రికెటర్ల నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. దీనిపై రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత స్టార్ క్రికెటర్లపై ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేత, రెజ్లర్ వినేష్ ఫోగట్ తీవ్ర అసంతృప్తి వెల్లగక్కారు.
ఒలింపిక్స్, కామన్వెల్త్ లాంటి టోర్నీల్లో అథ్లెట్లు సాధించిన విజయాలను ప్రశంసించే క్రికెటర్లు.. ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని వినేష్ ఫోగట్ ప్రశ్నించారు. దేశం మొత్తం క్రికెట్‌ను ఆరాధిస్తోందని.. కానీ ఏ ఒక్క క్రికెటర్ కూడా తమ ఆందోళనపై మాట్లాడటం లేదని సీరియస్ అయ్యారు. ఇది తమను ఎంతో బాధిస్తోందన్నారు. రెజ్లర్లకు అనుకూలంగా మాట్లాడకపోయినా పర్లేదని.. కానీ న్యాయం జరగాలని కోరుతూ ఒక్క పోస్ట్ అయినా పెట్టాలని ఆమె కోరారు. అసలు క్రికెటర్లు దేనికి భయపడుతున్నారో తమకు అర్థం కావడం లేదని వినేష్ ఫోగట్ చెప్పారు. బ్రాండ్ ఒప్పందాలను ప్రభావితం చేస్తుందని భయపడుతున్నారో లేదా వ్యవస్థను చూసి జంకుతున్నారో తెలియట్లేదన్నారామె. అక్కడ కూడా ఏదైనా జరుగుతుందేమోనని వినేష్ అనుమానం వ్యక్తం చేశారు.
Vinesh Phogat questioned the silence of Indian Cricketers.. pic.twitter.com/6f35ekLOge
— RVCJ Media (@RVCJ_FB) April 28, 2023