తమిళనాడు ఆటగాడు, త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్ రంజీల్లో దుమ్ము రేపుతున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23లో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేసి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఎలైట్ గ్రూప్-బిలో అస్సాంతో జరిగిన మ్యాచ్ లో విజయ్ శంకర్ హ్యాట్రిక్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తం 187 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 112 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో తమిళనాడు జట్టు అస్సాంపై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్ కంటే ముందు ఇదే ట్రోఫీలో మహారాష్ట్రపై(107), ముంబైపై(103) స్కోర్ చేసి శభాష్ అనిపించాడు.
ప్రస్తుతం విజయ్ శంకర్ తన కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నాడు. అయితే 2019లో టీమిండియా నుంచి స్థానం కోల్పోయిన తర్వాత విజయ్ శంకర్ అటు ఐపీఎల్ లో కూడా పెద్దగా రాణించింది లేదు. ఈ ప్రదర్శనతో విజయ్ శంకర్ టెస్టు జట్టులో స్థానం పొందే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే టీమిండియా టెస్టు స్క్వాడ్ లో హార్దిక్ పాండ్యా స్థానం ఖాళీగానే ఉంది. అటు బౌలర్ గా, ఇటు లోయరార్డర్ బ్యాట్స్ మన్ గా విజయ్ శంకర్ రాణించగలడు. అయితే గతంలో వచ్చిన అవకాశాలను విజయ్ శంకర్ సద్వినియోగ చేసుకోలేక పోయాడు.
2019 వరల్డ్ కప్ సమయంలో అంబటి రాయుడిని పక్కన పెట్టి మరీ విజయ్ శంకర్ కు అవకాశం కల్పించారు. అతడిని త్రీడీ ప్లేయర్ గా అభివర్ణిస్తూ అప్పటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ జట్టులోకి ఆహ్వానించాడు. ఆ సమయంలో అంబటి రాయుడు చేసిన ట్వీట్ కూడా చాలా వైరల్ అయ్యింది. అతడిని పక్కన పెట్టడంపై నేను వరల్డ్ కప్ ను త్రీడీ కళ్లద్దాల్లో చూస్తానంటూ రాయుడు ట్వీట్ చేశాడు. కానీ, విజయ్ శంకర్ వరల్డ్ కప్ లో కేవలం మూడు మ్యాచులు మాత్రమే ఆడి.. గాయం కారణంగా తప్పుకున్నాడు. 2018-19 లో విజయ్ శంకర్ టీమిండియా తరఫున 12 వన్డేలు, 9 టీ20లు ఆడాడు.
Desire•Discipline•Determination💯 #Chepauk#dreamcometruemoment
#🙏🏻 pic.twitter.com/Su4AyhkBSQ— Vijay Shankar (@vijayshankar260) January 18, 2023
కానీ విజయ్ శంకర్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండటంతో జట్టు నుంచి తప్పించారు. ఆ తర్వాతి నుంచి మళ్లీ విజయ్ శంకర్ కి టీమిండియా నుంచి పిలుపు రాలేదు. ప్రస్తుతం రంజీ ట్రీఫీలో చేస్తున్న ప్రదర్శనతో అతడికి కూడా విశ్వాసం పెరిగింది. ఈ ప్రదర్శనతో అయినా జాతీయ జట్టులో స్థానం దక్కుతుందని విజయ్ శంకర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. విజయ్ శంకర్ హ్యాట్రిక్ సెంచరీలు చేయడం చూసి అతడి అభిమానులు సైతం సంబరాలు చేసుకుంటున్నారు. అతను తిరిగి ఫామ్ లోకి రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Vijay Shankar is in a fine form in Ranji 🏏#CricketTwitter #india pic.twitter.com/zK0zJu08Ai
— Sportskeeda (@Sportskeeda) January 19, 2023