టీ 20 వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమి చాలా ప్రశ్నలను లేవనెత్తింది. ఇదే సమయంలో కోచ్ గా రాహుల్ ద్రావిడ్ రావడం, కెప్టెన్ కూడా మారడంతో ఇప్పుడు టీమ్ లో చాలా మంది స్థానం ప్రశ్నార్ధకంగా మారింది. ఇంత కాలం ఆడినా, ఆడకపోయినా మాకు డోకా లేదనుకున్న ఆటగాళ్లకి ఇప్పుడు సెగ తగలడం స్టార్ట్ అయ్యింది. ఈ విషయంలో ఇప్పుడు అందరి చూపు హార్దిక్ పాండ్యా వైపే ఉంది.
టీమిండియాకి సరైన ఆల్ రౌండర్ లేక అల్లాడుతున్న రోజుల్లో హార్దిక్ ఒక్కసారిగా దూసుకొచ్చాడు. 130 కిలో మీటర్ల స్పీడ్ తో బౌలింగ్ చేయగలగడం, బ్యాటింగ్ లో పవర్ హిట్టింగ్ చేయడం అతనికి ప్లస్ గా మారింది. దీంతో.. హార్దిక్ పాండ్యా టీమ్ లో పర్మినెంట్ ప్లేయర్ అయిపోయాడు. కొన్ని రోజుల పాటు తనపై పెట్టుకున్న అంచనాలను అందుకున్నాడు కూడా. ఇక ఐపీఎల్ లో కూడా మెరుపులు మెరిపించడంతో హార్దిక్ తక్కువ కాలంలోనే స్టార్ అయిపోయాడు. కానీ.., ఇక్కడ నుండే హారిక లెక్క చెడింది.
హార్దిక్ పాండ్యా తరువాత కాలంలో తన ఫిట్నెస్ పై ఫోకస్ తప్పాడు. బౌలింగ్ కి దూరమైపోయాడు. బ్యాటింగ్ లో ఫామ్ కోల్పోయాడు. ఐపీఎల్ లో మినహా.., టీమిండియా కోసం చెప్పుకోతగ్గ ప్రదర్శన చేయకుండా వచ్చాడు. కానీ.., టీమ్ సమతుల్యం కోసం ఆ స్థానంలో ఒక పవర్ హిట్టర్ ఉండాలి కాబట్టి.. పాండ్యాని కోహ్లీ భరిస్తూ వచ్చాడు. ఆఖరికి వరల్డ్ కప్ లాంటి పెద్ద ఈవెంట్ లో.. ప్రధాన మ్యాచ్ లలో కూడా హార్దిక్ బౌలింగ్ చేయకుండా, కేవలం బ్యాట్సమెన్ గానే కొనసాగాడు. అయితే.. ఇప్పుడు ఈ అలసత్వమే హార్దిక్ కొంప ముంచిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
త్వరలో న్యూజిలాండ్ తో జరగబోయే సిరీస్ కి హార్దిక్ పాండ్యా సెలక్ట్ కాలేదు. చాలా మంది అతనికి రెస్ట్ ఇచ్చారని అనుకుంటున్నారు. కానీ.., ఇక్కడ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆలోచన మరోలా ఉంది. న్యూజిలాండ్ కి సెలెక్ట్ అయిన టీమ్ ని గమనిస్తే అందులో వెంకటేష్ అయ్యర్ స్థానం సంపాదించుకున్నాడు. అది కూడా ఆల్ రౌండర్ కోటాలో. నిజానికి వెంకటేశ్ అయ్యర్ కి ఫస్ట్ క్లాస్ అనుభవం కూడా చాలా తక్కువ. కేవలం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే అతన్ని ఎంపిక చేశారు. అది కూడా ఓపెనర్ గా కాకుండా ఆల్ రౌండర్ గా.
వెంకటేశ్ అయ్యర్ కూడా హార్దిక్ పాండ్యాలానే గంటకి 130 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. పైగా.. లెఫ్ట్ హ్యాండెడ్ పవర్ హిట్టర్. అవసరమైనప్పుడు ఓపెనింగ్ కూడా చేయగలడు. పాండ్యాలానే అయ్యర్ భారీ షాట్స్ కొట్టగలడు. ఇవన్నీ వెంకటేశ్ అయ్యర్ ని పాండ్యాకి పోటీగా నిలబెడుతున్నాయి. కాబట్టి.. ఇకపై పాండ్యా స్థానాన్ని అయ్యర్ తో భర్తీ చేయాలన్నది టీమ్ ఆలోచనగా తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్లాన్ ఫలించి వెంకటేశ్ అయ్యర్ గనుక సక్సెస్ అయితే.. టీమ్ లో హార్దిక్ స్థానం గల్లంతు అయినట్టే. మరి.. హార్దిక్ పాండ్యా స్థానంలో వెంకటేశ్ అయ్యర్ సక్సెస్ అవుతాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.