తెలుగు తేజం తిలక్ వర్మ దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతూ అదరగొడుతున్న ఈ యువ క్రికెటర్.. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలోనూ దుమ్మురేపాడు. ఫోర్లు సిక్సులతో బౌలర్లపై విరుచుకుడి.. సెంచరీతో హైదరాబాద్ జట్టుకు ఒంటిచేత్తో విజయం అందించాడు. విజయ్ హజారే ట్రోఫీ 2022లో భాగంగా శనివారం హైదరాబాద్-మణిపూర్ మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో తిలక్ వర్మ సెంచరీతో రాణించాడు. కేవలం 77 బంతుల్లోనే 14 ఫోర్లు, 7 సిక్సులతో 126 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తిలక్ వర్మ దూకుడు ముందు మణిపూర్ బౌలర్లు తేలిపోయారు. అతన్ని అవుట్ చేసేందుకు శతవిధాల ప్రయత్నించిన మణిపూర్ బౌలర్లు.. చివరికి అవుట్ చేయలేక మ్యాచ్ చేజార్చుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మణిపూర్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు బౌలర్ బికాస్ సింగ్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్.. ఆరంభంలో తడబడింది. మణిపూర్ బౌలర్లు.. హైదరాబాద్ టాపార్డర్‌ను కుప్పకూల్చారు. కేవలం 28 పరుగులకే కెప్టెన్ తన్మయ్ అగర్వాల్(8), ఓపెనర్ సంతోష్ గౌడ్(3), వన్‌డౌన్ బ్యాటర్ ధీరజ్ గౌడ్(9) పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇక్కడి నుంచి రోహిత్ రాయుడితో జతకట్టిన తిలక్ వర్మ.. మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించాడు. 28.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసి హైదరాబాద్ విజయం సాధించింది.
తెలుగు కుర్రాడైన తిలక్ వర్మను ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2022 సీజన్‌లో రూ.1.7 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ 131 స్ట్రైక్‌రేట్‌తో 397 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు నిరాశ పర్చినా.. తిలక్ వర్మ మాత్రం తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కీలక సమయాల్లో మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. రోహిత్ శర్మ మనసు గెలుచుకున్నాడు. ఇక ఐపీఎల్ 2023 కోసం ముంబై తిలక్ వర్మను రిటేన్ కూడా చేసుకుంది. ఎడమ చేతి వాటం బ్యాటర్ అయిన తిలక్ వర్మ త్వరలోనే భారత జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం కూడా ఉంది.
Tilak Varma smashed 126* from just 77 balls in Vijay Hazare Trophy 2022.
— Johns. (@CricCrazyJohns) November 19, 2022