వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ క్రేజ్ రెట్టింపు అవ్వనుంది. ఐపీఎల్- 2022 నుంచి రెండు కొత్త టీమ్‌లు లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు బీసీసీఐ అధికారి క్లారిటీ ఇచ్చారు. ఒక్కో జట్టు బేస్ ప్రైస్ కూడా 2 వేల కోట్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. 14వ సీజన్‌కి ముందే రెండు కొత్త జట్లకు టెండర్లు పిలవాలని చూడగా.. కరోనా దష్ట్యా అది కుదరలేదు. ఐపీఎల్ 2021 పార్ట్-2 ముగిసేలోపే రెండు కొత్త జట్లకు టెండర్లు పిలవనున్నట్లు సమాచారం. ఐపీఎల్ సీజన్ 15 నుంచి బీసీసీఐ దాదాపు 5 వేల కోట్ల ఆదాయం టార్గెట్‌గా పెట్టుకుంది. వచ్చే సీజన్‌లో రెండు కొత్త టీమ్‌లు చేరితే బీసీసీఐకి 1500 కోట్ల నుంచి 2 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరుతుందని సమాచారం.
కొత్త ఫ్రాంచైజీలకు సంబంధించి ఐపీఎల్ 2022 టెండర్ పత్రం సెప్టెంబర్ నెలాఖరులో విడుదల అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ మధ్యలో బిడ్లు ఆహ్వానిస్తారని సమాచారం. అహ్మదాబాద్, లక్నో ఫ్రాంచైజీలు రేసులో ఉన్నట్లు సమాచారం. వాటిని దక్కించుకునేందుకు పారిశ్రామికవేత్తలు సహా సెలబ్రిటీలు, బిగ్‌షాట్‌లు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు అదాని, గోయెంకా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక ఐపీఎల్ సీజన్ 15 నుంచి టీమ్‌ల సంఖ్య 10కి చేరనుంది. 2011లో ఒకసారి 10 జట్లతో ఐపీఎల్ నిర్వహించారు. తర్వాత 2012, 2013లో ఫ్రాంచైజీల సంఖ్య 9కి పడిపోయింది. తర్వాత 8 జట్లతోనే సాగిన ఐపీఎల్.. వచ్చే సీజన్ నుంచి 10 జట్లతో అలరించనుంది. ఈసారి బ్రాడ్‌కాస్ట్ రైట్స్ కూడా చాలా ధర పలికే అవకాశం ఉందని తెలుస్తోంది.