ఎప్పటిలాగే మరో ఏడాది కూడా గతకాలపు శ్మశానానికి చేరుకుంది. మనకు తెలిసి రెండువేల ఇరవై ఒక్క(2021) సమాధులున్న గడిచిపోయిన కాలం కుప్పలో 2022 కూడా పడిపోయింది. ఎన్నో జ్ఙాపకాలను మనతో వదిలేసి వెళ్లిపోయింది. మరి క్రికెట్‌ను మతంలా భావించే భారతీయ క్రికెట్ అభిమానులకు 2022 ఎలాంటి జ్ఞాపకాలను అందించిందో.. ఒక సారి రివైండ్ చేసుకుంటూ.. టీమిండియాకు కలిసొచ్చిందా? రాలేదా? అనే విషయం తెలుసుకుందాం..
బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్ 2-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా 2022ను విజయంతోనే ముగించింది. అయితే 2022లో టీమిండియా అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 71 మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 46 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. 21 మ్యాచ్‌ల్లో ఓడింది. 3 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. మొత్తం మీద 64.78 విన్నింగ్స్ పర్సంటేజ్ సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. అలాగే 71లో 25 స్వదేశంలోనూ, మిగిలిన మ్యాచ్‌లు ఇండియా బయట జరిగాయి. ఈ ఒక్క లెక్కతో 2022లో టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉందనే అంచనాకు వచ్చేయకండి.. ఇంకాస్త లోతుగా విశ్లేషణలోకి వెళ్దాం. ఈ 71 మ్యాచ్‌ల్లో 7 టెస్టు మ్యాచ్‌లు.. వాటి టీమిండియా 4 గెలిచి, 3 ఓడింది.
ఈ 4 విజయాలు భారత్‌ను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌కు దగ్గర చేసింది. టెస్టుల్లో 57.14 విన్నింగ్ పర్సంటేజ్‌తో ఉంది భారత్. ఇక ఆ 71 మ్యాచ్‌ల్లో 24 వన్డేలు ఉన్నాయి. ఈ 24 వన్డేల్లో 14 మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. 8 మ్యాచ్‌ల్లో ఓడింది. 2 మ్యాచ్‌లు రద్దు వర్షం కారణంగా అయ్యాయి. దీంతో వన్డేల్లో 58.33 విన్నింగ్ పర్సంటేజ్ సాధించింది. ఇక 2022లో టీమిండియా అత్యధిక మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్‌లో ఆడింది. మొత్తం 40 టీ20 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. 28 విజయాలు, 10 ఓటములు, ఒక టై, ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో.. 70 శాతం విజయాలతో అద్భుత ప్రదర్శన చేసినట్లు కనిపిస్తున్నా.. నిజానికి 2022 టీమిండియాకు ఓ పీడకలలా గడిచింది.
2022 జనవరి 3న సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌తో వేట మొదలుపెట్టిన టీమిండయా.. ఆ సిరీస్‌ను ఓడిపోయింది. ఆ తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ 0-3తో ఓడింది. ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసింది. ఆ వెంటనే శ్రీలంకను సైతం మూడు టీ20లు, రెండు టెస్టుల్లో వైట్‌వాష్ చేసింది. ఆ రెండు కూడా చిన్న జట్లే. ఇక జూన్‌లో భారత పర్యటనకు వచ్చిన సౌతాఫ్రికాతో 5 టీ20ల సిరీస్ ఆడిన భారత్.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో 2-2తో కప్‌ను పంచుకుంది. జూలైలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన యంగ్ టీమిండియా రెండో టీ20ల్లో ఐర్లాండ్‌ను ఓడించింది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో ఓడిపోయింది. కానీ.. టీ20, వన్డే సిరీస్‌లను 2-1తో గెలిచింది. ఇంగ్లండ్ పర్యటన తర్వాత విండీస్ టూర్‌కు వెళ్లిన భారత్.. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి, 3 టీ20ల సిరీస్‌ను 2-1తో గెలిచింది. ఆ వెంటనే మరో రెండు టీ20లు వెస్టిండీస్‌పై గెలిచింది. ఆగస్టులో పసికూన జింబాబ్వేపై వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ 2022లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్.. గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటికి వచ్చింది. ఆ టోర్నీలో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడి.. 3 గెలిచి రెండు ఓడింది. ఆసియా కప్‌లో విఫలమైన టీమిండియా ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లు ఆడింది. ఆస్ట్రేలియాపై 2-1తో, సౌతాఫ్రికా టీ20, వన్డే సిరీస్‌లను 2-1తో గెలిచింది. ఈ సిరీస్‌ల తర్వాత.. టీ20 వరల్డ్ కప్ వేటను మధ్య విరాట్ కోహ్లీ విశ్వరూపంతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై నరాలు తెగే ఉత్కంఠ విజయంతో ప్రారంభించింది. సూపర్ 12లో 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో సెమీస్ చేరిన భారత్.. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయంతో ఇంటి బాట పట్టింది. వరల్డ్ కప్ తర్వాత యంగ్ టీమిండియా న్యూజిలాండ్‌తో రెండు టీ20 సిరీస్‌లో ఒక మ్యాచ్ టై కావడంతో 1-0తో గెలిచింది. వన్డే సిరీస్‌ను మాత్రం 0-1తో ఓడింది. ఇక తాజాగా బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌కు బంగ్లా పర్యటనకు వెళ్లిన టీమిండియా అవమానకరంగా.. వన్డే సిరీస్‌ను 1-2తో ఓడింది. కానీ.. టెస్టు సిరీస్‌లో బంగ్లాను 2-0తో వైట్ వాష్ చేసింది. 2022 క్యాలెండర్ ఇయర్‌లోని మ్యాచ్‌లను ముగించింది.
అయితే మ్యాచ్‌ల పరంగా టీమిండియా విన్నింగ్ పర్సంటేజ్ బాగానే ఉన్నా.. ఆ గెలిచిన మ్యాచ్‌ల్లో ఎక్కువగా చిన్న జట్లపైనే గెలిచింది. ఇంగ్లండ్‌ను ఇంగ్లండ్‌లో వన్డే, టీ20 సిరీస్‌లలో ఓడించడం మినహా ఈ ఏడాది టీమిండియా సాధించింది ఏమీ లేదు. పైగా ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌లో అదే ఇంగ్లండ్ చేతిలో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడి ఘోర అవమానం పొందింది. అలాగే ఆసియా కప్‌ను కూడా సాధించలేకపోయింది. ఇలా 2022లో ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్‌ల్లో విఫలం అయింది. ఇక 2022లో టీమిండియాకు పాజిటివ్ ఏంటంటే.. సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ అని చెప్పవచ్చు.
చాలా కాలంగా ఫామ్‌లో లేని కోహ్లీ.. ఆసియా కప్‌లో ఆఫ్ఘానిస్థాన్‌పై సెంచరీ ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్, హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో కొట్టిన రెండు భారీ సిక్సులు 2022లో భారత క్రికెట్ అభిమానులకు సంతోషాన్ని ఇచ్చాయి. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే.. 2022 టీమిండియాకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. అయినా కూడా.. ఈ పీడకల లాంటి ఏడాది మర్చిపోయి.. రానున్న 2023 వన్డే వరల్డ్ కప్‌ను టీమిండియా సాధించాలని ఆశిస్తూ.. కొత్త ఏడాదిలో టీమిండియా అంత శుభమే జరగాలని కోరుకుంటూ.. ఆల్‌బెస్ట్ చెబుదాం. మరి 2022లో టీమిండియా ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.