టెస్ట్, వన్డే సిరీస్‌ల కోసం టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. కానీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఈ సిరీస్‌పై బీసీసీఐ పునరాలోచనలో పడింది. ఈ నెల 17 నుంచి టీమిండియా సౌతాఫ్రికాతో మొదటి టెస్ట్ ఆడాల్సి ఉంది. దీని కోసం బీసీసీఐ భారత్ టెస్ట్ జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు దాదాపు నెల రోజుల పాటు టీమిండియా ఆటగాళ్లు దక్షిణాఫ్రికాలో పర్యటించాలి.
కానీ ఒమిక్రాన్ భయంతో బీసీసీఐ జట్టు ప్రకటనను వాయిదా వేసినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన అనుమతి వచ్చిన తర్వాతనే జట్టు ప్రకటన, పర్యటనపై నిర్ణయం తీసుకోనుంది. ఇది ఇలా ఉండగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా భారత జట్టుకు పూర్తి భద్రత కల్పిస్తామని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు హామీ ఇచ్చింది. కానీ బీసీసీఐ మాత్రం పర్యటనపై ఎటూ తేల్చుకోలేక సతమతమవుతోంది. పర్యటన వాయిదా వేసుకునే ఆలోచన బోర్డు పెద్దలు ఉన్నట్లు తెలుస్తుంది.
పర్యటనను పూర్తిగా రద్దు చేసుకోకుండా.. భవిస్యత్తు పరిణామాల అనుగుణంగా టూర్‌ను కొన్ని వారాల పాటు వాయిదా వేయాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ పర్యటన కనుక రద్దు అయితే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు భారీ ఆర్థిక నష్టం కలుగుతుంది.