టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తర్వాత విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. ధోనిలానే కోహ్లీ కూడా జట్టును చాలా కాలంపాటు విజయవంతంగా నడిపించాడు. కానీ 2021లో కోహ్లీ తొలుత టీ20 జట్టు కెప్టెన్‌గా తప్పుకుని.. వన్డే, టెస్టు జట్లకు కెప్టెన్‌గా కొనసాగుతానని ప్రకటించాడు. కానీ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒకే కెప్టెన్ ఉండాలని భావించిన బీసీసీఐ కోహ్లీని వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించి టీమిండియా సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మకు వన్డే, టీ20 కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది.
ఇక ఆ తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీ స్వచ్ఛందంగా తప్పుకోవడంతో మూడు ఫార్మాట్లకు రోహిత్ శర్మ పూర్తిస్థాయి కెప్టెన్ అయ్యాడు. కానీ.. గాయాలు, సరైన ఫిట్‌నెస్ లేకపోవడంతో అతని స్థానంలో ఏకంగా ఆరుగురు తాత్కాలిక కెప్టెన్లు అయ్యారు. అది కూడా కేవలం ఒక ఏడాది కాలంలోనే. దీంతో కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లీ తర్వాత అనిశ్చితి నెలకొన్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. విరాట్ కోహ్లీ తర్వాత.. రోహిత్ శర్మ పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినా అజింక్యా రహానే, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్థిక్ పాండ్యా తాజాగా ఇంగ్లండ్‌తో టెస్టుకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు కెప్టెన్లు అయ్యారు.
అంటే కోహ్లీ తర్వాత ఏకంగా 8 మంది కెప్టెన్లయ్యారు. వీరందరూ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన వారే కావడం విశేషం. కోహ్లీ కెప్టెన్లుగా ఉన్నంత కాలం టీమిండియాలో కెప్టెన్సీ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ.. కోహ్లీ తప్పుకున్న తర్వాత సిరీస్‌కు ఒక కెప్టెన్‌గా తయారైంది టీమిండియా పరిస్థితి.
గతంలో గంగూలీ తర్వాత ఇదే పరిస్థితి..
టీమిండియాకు చాలా కాలం పాటు కెప్టెన్‌గా వ్యవహరించిన మొహమ్మద్ అజరుద్దీన్.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో నిషేధానికి గురైన క్లిష్ట పరిస్థితుల్లో సౌరవ్ గంగూలీకి బీసీసీఐ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. ఈ బాధ్యతను దాదా ఎంతో సమర్థంగా నిర్వహించాడు. తన నాయకత్వ లక్షణాలతో టీమిండియాను ఒక కొత్త దారిలో నడిపించాడు. భారత క్రికెట్ దశాదిశను మార్చిన ఘనత గంగూలీకే దక్కుతుంది. స్వదేశంలోనే కాక విదేశాల్లో కూడా టీమిండియా విజయాలు సాధించేలా చేసిన కెప్టెన్ గంగూలీ.
ఇలా చాలా కాలంపాటు టీమిండియాను విజయవంతంగా నడిపించిన దాదా తర్వాత టీమిండియాకు కెప్టెన్‌గా ద్రవిడ్, సచిన్, సెహ్వాగ్ లాంటి వాళ్లు కెప్టెన్లుగా వ్యవహరించినా.. అంతగా సక్సెస్ కాలేదు. మళ్లీ ధోని రాకతో టీమిండియాకు ఒక బలమైన, స్థిరమైన కెప్టెన్ దొరికాడు. ధోని తర్వాత అలాంటి గ్యాప్ రాకుండా కోహ్లీ టీమిండియాను నడింపించాడు. కానీ.. గంగూలీ తర్వాత టీమిండియాకు కెప్టెన్సీ విషయంలో నెలకొన్న అనిశ్చితి మళ్లీ విరాట్ కోహ్లీ తర్వాత నెలకొన్నట్లు స్పష్టమవుతుంది. మరి ఈ ఆగమ్యగోచర పరిస్థితికి ఏ ఆటగాడు బ్రేక్ వేస్తాడో చూడాలి.
జట్టును నడిపించేందుకు ఫిట్‌నెస్ కూడా అవసరమే..
టీమిండియాకు ఆడే ఆటగాళ్ల టాలెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. జట్టు విజయం కోసం ఎవరి పాత్రను వారు శక్తిమేరా నిర్వహిస్తారు. కానీ.. కెప్టెన్‌గా ఉండేందుకు సీనియారిటీ, ఫామ్, లీడర్‌షిప్ క్వాలిటీతో పాటు ఫిట్‌నెస్‌తో ఉండడం కూడా ఎంతో ముఖ్యమనే విషయం ప్రస్తుతం టీమిండియా పరిస్థితిని పరిశీలిస్తే అర్థమవుతోంది. ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ టన్నుల కొద్ది పరుగులు చేయడం, మైదానంలో యాక్టివ్‌గా ఉంటూ జట్టు విజయం కోసం వ్యూహాలు రచించడంతో పాటు తమను తాము ఫిట్‌గా ఉంచుకునే వాళ్లు.. తరచూ గాయాల పాలు కాకుండా ఉండేలా జాగ్రత్త పడేవాళ్లు. ఎందుకంటే వాళ్లు జట్టుకు కెప్టెన్లు కనుక.. వారి పాత్ర ఎంత కీలకమో వారికి తెలుసు. అందుకే వారు టీమిండియాను చాలా కాలంపాటు నిర్విరామంగా నడిపించారు.
కానీ.. ఇప్పటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్‌కెప్టెన్ కేఎల్ రాహుల్ విషయంలో అది మిస్ అవుతున్నట్లు కనిపిస్తుంది. పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సిరీస్‌కే ఈ ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. దాని ఫలితంగా జట్టులోని ఆటగాళ్లందరూ కెప్టెన్లు అవుతున్నారు. ఈ కెప్టెన్సీ భారంతో ఒత్తిడి పెరిగి వారి వ్యక్తిగత ప్రదర్శనపై అది ప్రభావం చూపుతుంది. తాజాగా సౌతాఫ్రికాతో సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన రిషభ్ పంత్ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలం అయ్యాడు. ఇలా ప్రస్తుతం టీమిండియాను కెప్టెన్సీ సమస్య వేధిస్తుందనే చెప్పవచ్చు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
6 captains in the last 6 six months ,
BCCI is clearly struggling to find an all format captain after @imVkohli. And Virat Kohli missed only 4 games due to injury in his whole cricketing career. pic.twitter.com/KiSy8Wbuv9— ASHWIN (@viratian_tweetz) June 30, 2022
#TeamIndia Playing XI for the 5th Test Match
Live – https://t.co/xOyMtKJzWm #ENGvIND pic.twitter.com/SdqMqtz1rg
— BCCI (@BCCI) July 1, 2022