అనుకున్నంత పని జరిగింది. త్వరలో జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్ యూఏఈకి తరలిపోయింది. నిజానికి 2021 టీ20 వరల్డ్ కప్ నిర్వహణ బాధ్యతలు ముందుగా భారత్ దక్కించుకుంది. కానీ.., ఇప్పుడు దేశంలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. కొత్తగా ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ భయం ఎక్కువ అయ్యింది. ఇలాంటి సమయంలో ఇండియాలో ఈ మెగా టోర్నీ నిర్వహించడం దాదాపు అసాధ్యమే. ఇప్పటికే ఐపీఎల్ నిర్వహణ పూర్తిగా సాధ్యం కాక సగం మ్యాచ్ లను యూఏఈకే తరలించారు. ఈ నేపథ్యంలోనే 2021 టీ20 వరల్డ్ కప్ కూడా యూఏఈకి తరలంచినట్టు ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ క్రిక్ ఇన్ఫో ఓ కథనాన్ని పేర్కొంది. కానీ.., ఇప్పటి వరకు ఈవిషయంలో ఐసీసీ నుండి గాని, బీసీసీఐ నుండి గాని ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం విశేషం.
నిజానికి టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐకి మరో రెండు రోజుల సమయం ఉంది. కానీ.., ప్రస్తుత పరిస్థితుల్లో యూఏఈనే బెటర్ ఛాయిస్ అని ఐసీసీ భావించి, ఈ అనధికారికంగా షెడ్యూల్ ఫిక్స్ చేసినట్లు క్రిక్ ఇన్ఫో తన కథనంలో తెలియచేసింది. అక్టోబర్ 17 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుండగా, నవంబర్ 14న ఫైనల్ నిర్వహించనున్నారు. అయితే.., టోర్నీ నిర్వహణ భారత్ నుండి చేజారినా, ఇక్కడ ఇండియన్ క్రికెట్ టీమ్ కి కలసి వచ్చే మరో అంశం ఉంది. వరల్డ్ కప్ కన్నా ముందు యూఏఈలో ఐపీఎల్ 2021 మిగిలిన భాగం జరగనుంది. ఇది అక్టోబర్ 15 తో ముగియనుంది. అంటే.., ఇండియన్ ప్లేయర్స్ కి ఫుల్ మ్యాచ్ ప్రాక్టీస్ లభించనుంది అనమాట. ఇక ఈ టోర్నీలో ఇండియా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు బలంగా కనిపిస్తున్నాయి. మరి.. 2021 టీ20 వరల్డ్ కప్ విన్నర్ గా ఎవరు నిలవనున్నారో చూడాలి.