సాధారణంగా సినిమాల్లో ఒక డైలాగ్ చెబుతూ ఉంటారు. ప్రత్యర్థులు మ్యాచ్ గెలిస్తే మేం హృదయాలను గెలిచాం అని. బంగ్లాదేశ్- జింబాబ్వే మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఆటను గెలిస్తే.. జింబాబ్వే ఆటగాళ్లు ప్రేక్షకుల హృదయాలను గెలిచారు. ఆఖరి బంతి వరకు గెలవాలని వాళ్లు చేసిన పోరాటం ఎందరికో ఆదర్శం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి గెలవాల్సిన మ్యాచ్ లో జింబాబ్వే ఓడిపోయింది. సీన్ విలియమ్స్ చేసిన పోరాటం వృథా అయిపోయింది. ఈ మ్యాచ్ మొత్తం ఒక్కో బాల్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా అనిపించింది. ఆఖరి ఓవర్ మాత్రమే కాదు.. ఆఖరి బంతి వరకు కూడా ఆ ఉత్కంఠ అనేది కొనసాగింది. ఎట్టేకలకు ఓడిపోవాల్సిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ 3 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది.
అయితే ఈ మ్యాచ్ లో ఓ వింత ఘటన జరిగింది. అదే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఆఖరి ఓవర్లో జింబాబ్వేకి 16 పరుగులు కావాల్సి వచ్చింది. మొదటి బాల్ ర్యాన్ బ్లర్ సింగిల్ తీశాడు. తర్వాతి బాల్ లో బ్రాడ్ ఈవన్స్ ఔటయ్యాడు. మూడో బంతి ఫోర్ పోయింది, నాలుగో బంతిని నగరవ సిక్సర్ గా మలిచాడు. మ్యాచ్ మొత్తం మలుపు తిరిగింది అనుకున్న సమయంలో నగరవ స్టెపౌట్ అయ్యి వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత ఆఖరి బంతికి 5 పరుగులు కావాలి. అయితే ముజరబానీ కూడా క్రీజ్ బయటికి రావడంతో కీపర్ బాల్ అందుకుని.. స్టంపింగ్ చేశాడు. బంగ్లాదేశ్ ఆటగాళ్లు, జంబాబ్వే ఆటగాళ్లు మైదానం బయటకి కూడా వెళ్లిపోయారు.
అయితే ఆ తర్వాత అంపైర్లు మొత్తాన్ని మళ్లీ మైదానంలోకి పిలిచారు. ఎందుకంటే.. బంగ్లాదేశ్ కీపర్ బంతిని వికెట్ల కంటే ముందే అందుకోవడంతో అది నోబాల్ అయ్యింది. ఆఖరి బంతికి 4 పరుగులు చేయాల్సి రాగా.. ముజరబానీ బంతిని మిస్ చేశాడు. బంగ్లాదేశ్ 3 పరుగుల తేడాతే విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మాత్రం సీన్ విలియమ్స్ పోరాటాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. బౌండిరీలు పోకపోయినా కూడా.. ప్రతి బంతికి రెండు పరుగులు చొప్పున వికెట్ల మధ్య పరిగెడుతూనే ఉన్నాడు. మ్యాచ్ ని గెలిపించేందుకు చెమటోడ్చాడు. అయినా అతని పోరాటం వృథా కావడంతో అంతా నిరూత్సాహ పడ్డారు. బంగ్లాదేశ్- జింబాబ్వే మ్యాచ్ మాత్రం నిజంగా సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపించిందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.