ప్రస్తుతం ఒక్క ఇండియాలోనే కాదు.. ప్రపంచం మొత్తం ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. సాధారణంగా మ్యాచ్‌లను టీవీల్లో చూడచ్చు. లేదంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో చూడచ్చు. ఇప్పుడు చాలామంది అలాగే మ్యాచ్ చూస్తున్నారు. గత భారత్-పాక్ మ్యాచ్‌ని లైవ్‌లో కోటీ 60 లక్షల మంది చూశారు. ఓటీటీ యాప్‌లో క్రికెట్‌కు అంత క్రేజ్ ఉంటుంది. అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూడాలంటే తప్పకుండా సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఉండాలి. అయితే ఓ టెకీ సబ్‌స్క్రిప్షన్ ఉండే ఓటీటీల నుంచి కంటెంట్ తస్కరించి.. దానిని తన టీవీ ద్వారా ప్రసారం చేయడం ప్రారంభించాడు. అదికూడా ఏకంగా వరల్డ్ కప్ మ్యాచ్‌లనే ఫ్లీగా స్ట్రీమ్ చేసేశాడు. ఇంకేముందు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ చర్యలకు ఉపక్రమించింది.
వివరాల్లోకి వెళ్తే.. ఐటీ ఇంజినీర్ అయిన శుభమ్ పటేదార్‌కు శుబ్జ్ టీవీ అని ఒక యాప్‌ని తయారు చేశాడు. ఆ శుబ్జ్ టీవీ ద్వారా ఎన్నో ఓటీటీ సంస్థలకు చెందిన కంటెంట్‌ని ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తున్నాడు. అయితే ఇది వరల్డ్ కప్ సీజన్ కావడంతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అయ్యే ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఫ్రీగా తన ఛానల్‌లో స్ట్రీమ్ చేయడం ప్రారంభించాడు. అది గమనించిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుభమ్ పటేదార్ కోసం గాలింపు చరయ్లు చేపట్టారు. ఎట్టకేలకు అతడిని ఉజ్జయినీలో అరెస్టు చేశారు. అక్రమ ప్రసారాల ద్వారా డబ్బు సంపాదిస్తూ.. పెయిడ్ కంటెంట్‌ని ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తున్న శుభమ్ పటేదార్‌ని పోలీసులు అరెస్టు చేశారు.