టీ20 ప్రపంచ కప్ 2022 హోరా హోరిగా సాగుతోంది. ప్రారంభం నుంచే ఎన్నో సంచలనాలతో మెుదలైన ఈ మినీ సంగ్రామం.. ప్రస్తుతం రసవత్తరంగా మారింది. అయితే భారీ అంచనాలతో బరిలోకి దిగిన పెద్ద జట్లకు పసికూనల చేతిలో ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ పసికూనల దెబ్బకు రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ అయిన వెస్టిండీస్ జట్టు ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించింది. దాంతో ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ.. విండీస్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ తన కోచ్ పదవికి రాజీనామా చేశాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
వెస్టిండీస్.. 80, 90 దశకాల్లో క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన విండీస్.. రాను రాను తన ప్రాభవాన్ని కోల్పోయింది. వీవీ రిచర్డ్స్, బ్రియన్ లారా, చందర్ పాల్, క్రిస్ గేల్ వంటి దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత కరేబియన్ జట్టు తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. క్రమంగా ఓ అనామక జట్టుగా తయ్యారు అయ్యింది. అయితే టీ20 ల్లో మాత్రం భీకర హిట్టింగ్ టీమ్ గా తన పేరును లిఖించింది. డారెన్ సమీ నేతృత్వంలో 2012, 2016 లో రెండు సార్లు పొట్టి ప్రపంచ కప్ ను గెలుచుకుంది. మరే జట్టుకు రెండు సార్లు కప్ గెలిచిన చరిత్ర లేదు. మరి అలాంటి ఘన చరిత కలిగిన వెస్టిండీస్ జట్టు 2022లో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. గ్రూప్ దశలో మూడు మ్యాచ్ ల్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి స్కాట్లాండ్, ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. దీంతో జట్టు ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ వెస్టిండీస్ హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ తన పదవికి రాజీనామా చేశారు.
రాజీనామాపై సిమ్మన్స్ మాట్లాడుతూ..”మా ఓటమి కేవలం జట్టును మాత్రమే కాకుండా యావత్ క్రికెట్ అభిమానులను బాధపెట్టింది. ఈ టోర్నీ మమ్మల్ని తీవ్రంగా నిరాశ పరిచింది. అయితే టీ20 ప్రపంచ కప్ లో ఓడిపోయినందుకు నేను రాజీనామా చేయట్లేదు” అని సిమ్మన్స్ స్పష్టం చేశాడు. కొన్నిరోజుల క్రితం తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు తెలిపాడు. అప్పటి నుంచే రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు సిమ్మన్స్. ఈ సందర్బంగా తన రాజీనామపై ఓ ప్రకటన విడుదల చేశాడు. 2016 టీ20 ప్రపంచ కప్ విండీస్ గెలిచినప్పుడు కూడా సిమ్మన్సే కోచ్ కావడం గమనార్హం. ఇదిలా ఉండగా వెస్టిండీస్ ఓటమికి బాధ్యతగా విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ కూడా కెప్టెన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.