15 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు.. ఎన్నో కలలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా.. సెమీస్‌లో పోరాటం ముగించి తిరుగుపయనమైంది. ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2022లో సూపర్ 12లో ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో గ్రూప్ బీ టాపర్‌గా సెమీస్ చేరిన భారత్.. అడిలైడ్ వేదికగా గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో పరాజయం పాలైంది. దీంతో వరల్డ్ కప్‌లో టీమిండియా పోరాటం ముగిసింది. ఎప్పుడో 2007లో టీ20ల్లో తొలి వరల్డ్ కప్‌ను నెగ్గిన టీమిండియా.. మళ్లీ ఆ పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడలేదు. కనీసం ఇప్పుడైనా రోహిత్ కెప్టెన్సీలో కప్ వస్తుందని ఆశపడిన భారత క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.
ఇక వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా అభిమానులు కాస్తో కూస్తో సంతోషం కలిగించిన విషయం ఏదైనా ఉందంటే.. అది విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ అనే చెప్పాలి. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడాడు. తన పని అయిపోయిందని అవాకులు చవాకులు పేలిన వారికి తగిన రితీలో సమాధానం చెప్తూ.. నాలుగు హాఫ్ సెంచరీలతో దుమ్మురేపాడు. ఈ వరల్డ్ కప్ టోర్నీకి ముందు సరైన ఫామ్‌లో లేడని.. జట్టుకు భారం అయ్యాడని.. వరల్డ్ కప్‌కు ఎంపిక చేయడం వేస్ట్ అని ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీ.. టోర్నీ మొత్తం జట్టును ముందుండి నడిపించాడు. తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు.
ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై హాఫ్ సెంచరీ, తర్వాత బంగ్లాదేశ్‌పై, సెమీస్‌లో ఇంగ్లండ్‌పై హాఫ్ సెంచరీలతో రాణించాడు. మొత్తం ఆరు మ్యాచ్‌లో ఆడిన కోహ్లీ సగం మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా మిగిలాడు. 296 పరుగులతో ఇప్పటికే కోహ్లీనే వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. కాగా.. సెమీస్‌లో ఇంగ్లండ్‌తో ఓటమి తర్వాత తీవ్ర నిరాశలో మునిగిపోయిన కోహ్లీ.. తొలి సారి ట్వీట్టర్ వేదికగా స్పందించాడు. ‘మా కలకు కొద్ది దూరంలో ఆగిపోయి.. నిరాశతో నిండిన హృదయాలతో ఆస్ట్రేలియా తీరాలను వదిలి వెళ్లిపోతున్నాం. కానీ.. ఒక జట్టుగా చిరస్మరణీయ క్షణాలు పొందగలిగాం. ఇక్కడి నుంచి మరింత బెటర్ అవ్వడంపై దృష్టిపెడతాం’ అని కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ ఎమోషనల్ ట్వీట్ కోహ్లీ ఫ్యాన్స్ గుండెలను పిండేస్తోంది.
We leave Australian shores short of achieving our dream and with disappointment in our hearts but we can take back a lot of memorable moments as a group and aim to get better from here on. pic.twitter.com/l5NHYMZXPA
— Virat Kohli (@imVkohli) November 11, 2022