టీ20 ప్రపంచ కప్ 2022 మినీ సంగ్రామంలో టీమిండియా శుభారంభం చేసింది. తన చిరకాల ప్రత్యర్థి పాక్ పై ఆసియా కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. క్రికెట్ అభిమానులు గుండెలను చేతిలో పెట్టుకు చూసిన ఈ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో పాక్ పై గెలిచింది. కింగ్ కోహ్లీ మరో సారి తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. 82 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. అయితే కోహ్లీ కమాల్ ఇన్నింగ్స్ లో టీమిండియా చేసిన తప్పులన్నీ మాయం అయిపోయాయి. ఈ తప్పులే గనక టోర్నీలో కొనసాగిస్తే.. టీమిండియా ముందుకు వెళ్లడం కష్టమే అంటున్నారు క్రీడానిపుణులు. మరి భారత్ సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన విభాగాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.
1. టాపార్డర్ వైఫల్యం
టీ20 ప్రపంచ కప్ కు ముందు టీమిండియా బ్యాటింగ్ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపించారు. మన దేశ మాజీ క్రికెటర్లతో పాటు ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లు సైతం టీమిండియా బ్యాటింగ్ విభాగాన్ని ఢీ కొట్టే జట్టు టోర్నీలోనే లేదని అభిప్రాయ పడ్డారు. ఇక మిస్టర్ 360 గా పేరుగాంచిన సూర్యకుమార్ యాదవ్ ను ఆకాశానికి ఎత్తేశారు. అదీ కాక పాక్ తో మ్యాచ్ కు ముందు.. పాక్ కు భీకర బౌలింగ్ దళం ఉంటే మాకు అరివీర భయంకర బ్యాటర్లు ఉన్నారు అంటూ.. సవాల్ విసిరాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. కానీ మ్యాచ్ లోకి దిగాక తెలిసింది మన ప్రదర్శన. పాక్ పేస్ బౌలింగ్ ను ఎదుర్కొనలేక 6 ఓవర్లకు 31 పరుగులకే 4 వికెట్లు కోల్పొయి పీకల్లోతు కష్టాల్లో పడింది. హారీస్ రౌఫ్, షాహీన్ షా లు తమ పదునైన బంతులతో టీమిండియా బ్యాటర్లను బెంబేలెత్తించారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ అయితే బాల్స్ ఆడాలా? వదిలేయాలా? అన్న సందిగ్దంలో బ్యాటింగ్ చేయడం మనం చూశాం. గేమ్ ఛేంజర్ గా పిలిపించుకున్న సూర్య కూడా నిర్లక్ష్యంగా ఆడి అవుట్ అయ్యాడు. రోహిత్, రాహుల్, సూర్యలు రాణించకపోతే.. రాబోయే మ్యాచ్ ల్లో భారత్ కు కష్టాలు తప్పవనే అంటున్నారు మాజీ క్రికెటర్లు.
2. ఒత్తిడిని జయించాలి
ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలు అంటే సాధారణంగానే ఒత్తిడి ఉంటుంది. పైగా ఆసిస్ లాంటి బౌన్సీ పిచ్ మీద మ్యాచ్ లు ఆడేది. దాంతో మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. కానీ టీమిండియాలో చాలా మందికి అక్కడ ఆడిన అనుభవం ఉంది. పైగా భారత జట్టు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉంది. కానీ పాక్ తో మ్యాచ్ జరిగాక తెలిసింది టీమిండియాలో ఉన్న లొసుగులేంటో! మరీ ముఖ్యంగా కేఎల్ రాహుల్ బ్యాటింగ్.. అతడు పాక్ బౌలర్లకు బయపడ్డట్లు స్పష్టంగా మనకు కనిపించింది. ఫినిషర్ దినేష్ కార్తీక్ బ్యాటింగ్ దిగే ముందు వాష్ రూమ్ కు పరిగెత్తడం కూడా మనం చూశాం. ఆ ఒత్తిడిలోనే భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. పాండ్యా సైతం భారీ షాట్లు ఆడినప్పటికీ అవి బ్యాట్ కు సరిగ్గా కనెక్ట్ కాలేదు. ఇవన్ని చూస్తేనే తెలుస్తుంది ఆటగాళ్లు ఎంత ఒత్తిడిలో ఉన్నారో అని. నిజమే మైదానంలో ఎంత ఒత్తిడి ఉంటుందో మనందరికి తెలుసు. కానీ ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీల్లో ఒత్తిడిని జయించడం చాలా ముఖ్యం. దీనిపై టీమిండియా కాస్తా గట్టిగానే ఫోకస్ పెట్టాల్సి ఉంది.
3. ఫీల్డింగ్ వైఫల్యం
ఆసియా కప్ నుంచి టీమిండియా ఇంటిదారి పట్టడానికి ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫల్యం. అయినప్పటికీ దాని నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదనిపిస్తోంది భారత్. తాజాగా జరిగిన మ్యాచ్ లో సైతం భారత ఫీల్డర్లు మూడు క్యాచ్ లను చేజార్చారు. దాంతో పాక్ 160 పరుగులు చేయగలిగింది. అదే ఆ క్యాచ్ లను పట్టి ఉంటే పాకిస్థాన్ 120-130 పరుగులకే కట్టడి అయ్యి ఉండేది. అదీ కాక ఓ రనౌట్ అవకాశాన్ని కూడా టీమిండియా వదులుకుంది. రానున్న మ్యాచ్ లు కీలకం కానునండటంతో టీమిండియా కచ్చితంగా ఫీల్డింగ్ వి భాగంపై ఫోకస్ పెట్టాల్సి ఉంది. లేకపోతే ఆసియా కప్ లో లాగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
4. బౌలింగ్ తప్పిదాలు
ఆసియా కప్ నుంచి టీమిండియా బౌలింగ్ దళాన్ని వైఫల్యాలు వెంటాడుతున్నాయి. అదీ కాక గాయాల కారణంగా స్టార్ బౌలర్లు మెగా టోర్నీకి దూరం అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే పాక్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత అద్భుతంగా బౌలింగ్ చేసిన బౌలర్లు చివర్లో చేతులెత్తేశారు. దాంతో పాక్ కు ఎక్స్ ట్రాగా 30 పరుగులు వచ్చాయి. డెత్ ఓవర్లో ధారాళంగా పరుగులు ఇవ్వడం టీమిండియా ఇంకా మానలేదు. అలాగే పేస్ పిచ్ లపై ఇంకో పేసర్ తో భారత్ బరిలోకి దిగితే బాగుండేది అన్నది క్రీడానిపుణుల అభిప్రాయం. ఈ మ్యాచ్ లో అర్షదీప్, భువనేశ్వర్ కుమార్ టీమిండియా బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించారు. మిగతా బౌలర్లు పొదుపుగానే బౌలింగ్ చేసినప్పటికీ చివర్లో పట్టు విడిచారు. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ దారుణంగా విఫలం అయ్యాడు. డెత్ ఓవర్లలో పరుగులు ఆపడంపై టీమిండియా కాస్త గట్టిగానే ఫోకస్ పెట్టాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయా పడుతున్నారు. ఈ నాలుగు అంశాలను భారత జట్టు సీరియస్ గా తీసుకుని వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్తేగానీ టీమిండియా టీ20 ప్రపంచ కప్ లో ముందుకు సాగలేదు.