సాధారణంగా ప్రతీ క్రికెటర్ కు ఓ గ్రౌండ్ తో విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఇక ఆ గ్రౌండ్ లో మ్యాచ్ అంటే కచ్చితంగా అతడు ఆ రోజు చెలరేగుతాడు అని నమ్మకం. అలా ఈడెన్ గార్డెన్ లో మ్యాచ్ అంటే గాడ్ ఆఫ్ క్రికెట్.. సచిన్ టెండుల్కర్ కు పండగే. ఈ మైదానంలో సచిన్ 47.88 యావరేజ్ తో 872 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక టీమిండియా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి చెన్నైలోని చెపాక్ స్టేడియం అంటే ఎంతో ఇష్టం. ఈ గ్రౌండ్ లో 6 మ్యాచ్ లు ఆడిన ధోని 2 శతకాలు, 1 అర్దశతకంతో 401 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా స్టార్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లీకి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ విడదీయరాని అనుబంధమే ఉంది. ఈ గ్రౌండ్ లో మ్యాచ్ అంటే కోహ్లీకి పండగే అని మరో సారి నిరూపించాడు. తాజాగా నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 62 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆస్ట్రేలియా గడ్డపై వరల్డ్ కప్ అనగానే ప్రపంచ దేశాల ఆటగాళ్లందరికి చెమటలు పట్టి ఉంటాయి. దానికి కారణం అక్కడి బౌన్సీ పిచ్ లే. ఈ బౌన్సీ పిచ్ ల కారణంగా ప్లేయర్స్ గాయాలపాలైన సందర్బాలు చరిత్రలో అనేకం. దాంతో సహజంగానే ఆటగాళ్లకు కొంత భయం అనేది ఉంటుంది. కానీ అందరి బౌలర్లకు ఓ బ్యాటర్ అంటే భయం. అతడే టీమిండియా రన్ మెషిన్.. కింగ్ విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియా గడ్డపై చెలరేగుతాడు విరాట్.. మరీ ముఖ్యంగా సిడ్నీలో మ్యాచ్ అంటే బఠాణీలు తిన్నంత ఈజీగా రన్స్ చేస్తాడు కోహ్లీ. బౌలర్లను తుత్తునీయలు చేస్తూ.. ఫోర్లు, సిక్సర్లతో వారిపై విరుచుకుపడుతుంటాడు. దాంతో అతడికీ.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ కు విడదీయరాని అనుబంధం ఏర్పడింది.
Virat Kohli in SCG in T20I:
50(36)
61*(41)
40(24)
85(61)
62*(44) pic.twitter.com/xbR8mKMu0f— Johns. (@CricCrazyJohns) October 27, 2022
ఈ గ్రౌండ్ లో అంతర్జాతీయ టీ20 ల్లో ఇప్పటి వరకు 298 రన్స్ చేసి, అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఈ మైదానంలోనే 2020లో ఆస్ట్రేలియాపై 36 బంతుల్లో 50 పరుగులు చేసి 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే సిడ్నీ గ్రౌండ్ లో గత ఐదు మ్యాచ్ ల్లో వరుసగా 50, 61*, 40, 85, తాజాగా 62* పరుగులు చేసి మరో సారి తనకు సిడ్నీ గ్రౌండ్ లో తిరుగులేదని నిరూపించాడు. అయితే గతంలో ఓ సందర్భంలో విరాట్ మాట్లాడుతూ..”ఆస్ట్రేలియా గడ్డపై మరీ ముఖ్యంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ప్రేక్షకుల ఈలల.. గోలల.. మధ్య మ్యాచ్ ఆడటం నాకు ఇష్టం. ఎందుకో ఇక్కడి వాతావరణమంటే నాకు అమితమైన ప్రేమ” అని విరాట్ చెప్పాడు.