ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఈసారి చాలా అద్భుతాలు జరిగాయి. వాటిలో పాకిస్తాన్ జట్టు ఫైనల్ చేరడాన్ని మహాద్భుతంగా చెప్పొచ్చు. మొదటి రెండు మ్యాచుల్లో పరాజయం పాలయినా కూడా.. సౌతాఫ్రికా జట్టు ఓటమితో అనూహ్యంగా పాక్ సెమీస్ చేరింది. అయితే ఇంకో అద్భుతం చేసి పాకిస్తాన్ జట్టు కప్పు కూడా కొడుతుందని ఆ జట్టు సభ్యులు, పాక్ మాజీలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫలితం సంగతి పక్కన పెడితే ఫైనల్ చేరినప్పటి నుంచి వారి గప్పాలు చూడలేక నెటిజన్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందుకు తోడుగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ గురించి సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వైరల్ అవుతున్నాయి.
విషయం ఏంటంటే.. సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటివి కాదు. భారత్- ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగుతున్న సమయంలో ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. “బాబర్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు ఈ పొట్టి ప్రపంచకప్‌ను గెలిస్తే గనుక.. అతను 2048లో పాకిస్తాన్‌కు ప్రధాని అవుతాడు” అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. సునీల్ అలా మాట్లాడటానికి కారణం లేకపోలేదు. 1992లో ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో పాకిస్తాన్ వరల్డ్ కప్ టైటిల్‌ని సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్‌లో ఇమ్రాన్ ఖాన్ 72 పరుగులు చేసి వారి జట్టులోనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇమ్రాన్ ఖాన్ వరల్డ్ కప్ అందించిన 26 ఏళ్ల తర్వాత ఆ దేశానికి ప్రధాని అయ్యారు. తర్వాత ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్‌ని నాలుగేళ్లు పాలించారు. ఇప్పుడు సునీల్ గవాస్కర్ కూడా ఆ ఫార్ములానే బాబర్‌కు ఆపాదిస్తూ కామెంట్స్ చేశాడు. అలా బాబర్ కూడా ఇప్పుడు టైటిల్ అందిస్తే.. అతను 2048లో పాకిస్తాన్ ప్రధాని అవుతాడంటూ సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. నిజానికి సన్నీ ఈ వ్యాఖ్యలను ఫన్నీగానే చేసినా కూడా ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. మరోవైపు మెల్‌బోర్న్ పాక్- ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ జరగనుండగా.. అక్కడి వాతావరణం కాస్త కలవరపెడుతోంది. మెల్‌బోర్న్‌లో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం అక్కడ వర్షం పడేందుకు 95 శాతం అవకాశాలు ఉన్నాయంటున్నారు. రిజర్వ్ డే అయిన సోమవారం కూడా మెల్‌బోర్న్‌లో వర్షం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి.. ఫైనల్ మ్యాచ్ పరిస్థితి ఏంటని వేచిచూడాలి
🏆🇵🇰🏴
1️⃣ day to go for the final!#WeHaveWeWill | #T20WorldCup pic.twitter.com/HsjjXXTwcg— Pakistan Cricket (@TheRealPCB) November 12, 2022