స్టోయినిస్ విధ్వంసానికి శ్రీలంక బౌలర్లు బలి.. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!

  • Written By:
  • Publish Date - October 25, 2022 / 08:47 PM IST

టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన ఆస్ట్రేలియా జట్టు తొలి విజయాన్ని అందుకుంది. శ్రీలంకతో జరిగిన మ్యాచులో 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత శ్రీలంక బ్యాటర్లను తక్కువ పరుగులకే కట్టడి చేసిన ఆసీస్ ఆటగాళ్లు, ఆపై 21 బంతులు మిగిలిఉండగానే ఆ లక్ష్యాన్ని చేధించారు. అయితే.. ఈ మ్యాచులో ఆసీస్ బ్యాటర్ మార్కస్ స్టొయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఆస్ట్రేలియా తరుపున ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

టాస్ గెలిచి ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ చేపట్టిన లంకేయులు 157/6 స్కోరుకే పరిమితమయ్యారు. కుశాల్ మెండిస్ (5) విఫలమవగా.. పాథుమ్ నిస్సంక (40) వన్డే తరహాలో ఆడాడు. ఆ తర్వాత వచ్చిన ధనంజయ డిసిల్వా (26), చరిత్ ఆసలంక (38 నాటౌట్) ధాటిగా ఆడినప్పటికీ మరోవైపు నుంచి అతనికి సహకారం లభించలేదు. చివర్లో చమిక కరుణరత్నే (7 బంతుల్లో 14 నాటౌట్) కూడా బ్యాటు ఝుళిపించడంతో కనీసం ఆ మాత్రపు స్కోరైనా చేసింది. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆస్టన్ అగర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీసుకున్నారు.

అనంతరం లక్ష్య ఛేదనకు కంగారూలు ఆదిలోనే తడబడ్డారు. వార్నర్ (11), మిచెల్ మార్ష్ (18) ఇద్దరూ విఫలమయ్యారు. ఫామ్ లేక సతమతమవుతున్న ఆసీస్ సారధి ఆరోన్ ఫించ్ (42 బంతుల్లో 31 నాటౌట్) జిడ్డు బ్యాటింగ్‌ ఆడుతూ విసుగు పుట్టించాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (12 బంతుల్లో 23) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లో ఊపు తెచ్చాడు. అతను అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టొయినిస్ (59 నాటౌట్; 18 బంతుల్లో, 4 ఫోర్లు, 6 సిక్సర్లు ) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ఆసీస్ జట్టు 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV