మినీ సంగ్రామం.. మహా సంగ్రామంగా సాగుతున్న వేళ.. ప్రత్యర్థి ఆటగాళ్లు, సారథులు టీమిండియాపై మాటల దాడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. మెున్నటికి మెున్న సౌతాఫ్రికా పేసర్ ఎన్రిచ్ నోర్ట్జె తమ పేస్ తడాఖా చూపిస్తాం అని సవాల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ సైతం టీమిండియాను ఓడిస్తాం అని ధీమా వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే షకీబ్ టీమిండియా స్టార్ బ్యాటర్ బ్యాటింగ్ కు ఫిదా అయ్యానంటూ.. అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడిని మేం అవుట్ చేయడం కోసం మేం ప్రత్యేకమైన వ్యూహాల్ని రడీ చేస్తున్నట్లు పేర్కొన్నాడు.
సూర్య కుమార్ యాదవ్.. ప్రస్తుతం అరివీర భయంకర బ్యాట్స్ మెన్ లలో SKY మెుదటి స్థానంలో ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సూర్య క్రీజ్ లోకి అడుగు పెట్టాడు అంటే చాలు.. బంతులు బౌలర్ల చేతిలో కంటే ప్రేక్షకుల చేతుల్లోనే ఎక్కువ సేపు ఉంటాయి. అంత భీకరంగా ఉంటుంది సూర్య బ్యాటింగ్. బౌలర్ ఎవరన్నది అతడికి అక్కర్లేదు. బాల్ ను బాదడమే అతడి లక్ష్యం. దాంతో SKY బ్యాటింగ్ స్టైల్ కి, అతడి షాట్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు మంత్ర ముగ్దులైయ్యారు. కొంత మంది క్రీడాదిగ్గజాలు సైతం సూర్య ఆటకు అభిమానులుగా మారాం అని చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ సైతం సూర్య కుమార్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.
షకీబ్ సూర్య కుమార్ గురించి మాట్లాడుతూ..”ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో సూర్య కుమార్ యాదవ్ లాంటి బ్యాటర్ ను నేను చూడలేదు. ఇప్పుడు అతడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. గత సంవత్సరం నుంచి అతడు అద్భుతమైన రిథమ్ లో ఆడుతున్నాడు. టీ20ల్లో సూర్య నెంబర్.1 ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. SKYలాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ చాలా తక్కువ మందే ఉంటారు” అని షకీబ్ పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రస్తుతానికి అయితే బంగ్లా టీమ్ ఎటువంటి సమావేశాలు జరపలేదని షకీబ్ అన్నాడు. అలాగే జట్టు విజయం కోసం అన్ని డిపార్ట్స్ మెంట్స్ ను కూడా బలోపేతం చేసుకుంటాం అని షకీబ్ పేర్కొన్నాడు. ఇక టీమిండియా తన తర్వాతి మ్యాచ్ లో బుధవారం బంగ్లాదేశ్ తో తలపడబోతోంది. భీకర ఫామ్ లో ఉన్న సూర్య కుమార్ ను బంగ్లా బౌలర్లు ఏ విధంగా ఎదుర్కొంటారో వేచిచూడాలి.