టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, పార్థీవ్ పటేల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగిన ఈ మాజీ స్టార్లు.. ఇప్పుడు మాత్రం క్రికెట్ అభిమానుల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. అందుకు.. ఐర్లాండ్, అఫ్ఘానిస్థాన్ జట్ల విషయంతో వారు చేసిన తప్పుడు కామెంటే కారణం. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2022 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో వర్షం కారణంగా పలు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. అందులో శుక్రవారం ఐర్లాండ్, అఫ్ఘానిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అయితే టాస్ కూడా పడకుండానే వర్షం కారణంగా రద్దు అయింది.
ఈ టోర్నీకి నేరుగా క్వాలిఫై అయిన అఫ్ఘానిస్థాన్‌కు వర్షం వల్ల తీవ్ర నష్టం జరిగింది. ఆ జట్టు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడింది. అందులోనూ ఓడింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు వర్షార్పితం అయ్యాయి. దీంతో కేవలం 2 పాయింట్లతో అఫ్ఘానిస్థాన్ దాదాపు ఈ టోర్నీ నుంచి వైదొలిగినట్టే. మరో రెండు మ్యాచ్‌లు ఉన్నా.. అందులో విజయాలు సాధించినా.. సెమీస్ చేరడం కష్టమే. ఇక ఐర్లాండ్ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. గ్రూప్ స్టేజ్‌లో వెస్టిండీస్ లాంటి బలమైన జట్టుకు షాకిచ్చి.. గ్రూప్ టాపర్‌గా నిలిచి సూపర్ 12కు అర్హత సాధించింది. ఇక సూపర్ 12లోనూ ఇంగ్లండ్ లాంటి టైటిల్ ఫేవరేట్ టీమ్‌ను ఓడించి.. పాయింట్ల పట్టికల్లో మూడో స్థానంలో నిలిచింది. మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఒక ఓటమి, ఒక రద్దుతో మూడు పాయింట్లతో ఉంది.
ఇక శుక్రవారం అఫ్ఘానిస్థాన్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడం.. ఐర్లాండ్ కంటే, అఫ్ఘాన్‌కే ఎక్కువ నష్టం చేసింది. ఇక ఈ మ్యాచ్ గురించి ఒక స్పోర్ట్స్ ఛానెల్‌లో చర్చకు కూర్చున్న టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, పార్థీవ్ పటేల్.. ఐర్లాండ్, అఫ్ఘానిస్థాన్ జట్టను అసోసియేట్ జట్లుగా పేర్కొని పప్పులో కాలేశారు. క్రికెట్‌లో ఇంత అనుభవం ఉండి కూడా.. టెస్టు హోదా కలిగిన జట్లను అసోసియేట్ జట్లుగా పేర్కొని వాటిని అవమానించారంటూ క్రికెట్ అభిమానులు ఈ ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంచెం ప్రొఫెషనల్‌గా వ్యవహరించాలని హితవు పలుకుతున్నారు. ఈ విషయంపై పార్థీవ్ పటేల్ అక్కడే తనను క్షమించాలని కోరడం గమనార్హం.
Some professionalism please… pic.twitter.com/whYV7UPuA5
— Karthik Raj (@kartcric) October 27, 2022