టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్, ఛేజ్ మాస్టర్, కింగ్ కోహ్లీ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ టాప్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ.. ఆ మూడు మ్యాచ్‌ల్లోనూ నాటౌట్‌గా నిలిచి.. తన ఫామ్‌లో ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ఎంత చెప్పుకున్న తక్కువే.. 82 పరుగులతో ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఆ వెంటనే నెదర్లాండ్స్‌పై 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సౌతాఫ్రికాపై 12 పరుగులతో నిరాశ పర్చినా.. కీలకమైన బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇలా సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్న కోహ్లీ.. ఇదే క్రమంలో ఒక ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 1016 రన్స్‌తో టీ20 వరల్డ్ కప్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి జయవర్దనే రికార్డును బద్దలుకొట్టి.. కొత్త చరిత్రను లిఖించాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ.. 1065 పరుగులతో టీ20 వరల్డ్ కప్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. టీమిండియా ఫైనల్ వరకు చేరితే.. మరో మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మ్యాచ్ మ్యాచ్‌లతో కోహ్లీ మరిన్ని పరుగులు చేసి.. తన రికార్డును మరింత పటిష్టం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. విరాట్ కోహ్లీ ఈ అరుదైన రికార్డును సాధించడంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సైతం విరాట్ కోహ్లీ సాధించిన వరల్డ్ రికార్డ్‌పై స్పందించాడు.
ఊతప్ప మాట్లాడుతూ..‘విరాట్ కోహ్లీ ఈ రికార్డు క్రియేట్ చేయడం పెద్ద విశేషం కాదు. అతని స్థాయికి ఇది చాలా చిన్న విషయం. కోహ్లీ ఆటకు వీడ్కోలు పలికే సమయానికి అతని పేరున చాలా రికార్డులు ఉంటాయి. ఇప్పుడు కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త నిదానంగా ఆడుతున్నా.. ఎప్పుడు గేర్ మార్చాలో అతనికి బాగా తెలుసు. అయితే కోహ్లీని మనం ఎలాంటి ఫామ్‌లో చూడాలనుకున్నామో.. ప్రస్తుతం అతను అదే స్థాయి ఫామ్‌లో ఉన్నాడు.’ అని రాబిన్ పేర్కొన్నాడు. కాగా.. టీమిండియా 2007లో సాధించిన తొలి టీ20 వరల్డ్ కప్ జట్టులో ఊతప్ప సభ్యుడన్న విషయం తెలిసిందే. అలాగే.. పాకిస్థాన్‌పై బౌలౌట్‌లో ఊతప్ప కూడా ఒక వికెట్ పడగొట్టి.. ఒంగి క్యాప్ తీసే సీన్ క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ స్పెషలే.
Virat Kohli in T20 World Cups hits different 👑💥
📸: Disney+Hotstar#T20WorldCup pic.twitter.com/mqFfc2hiSJ
— CricTracker (@Cricketracker) November 3, 2022