ఐపీఎల్.. క్రికెట్ ప్రపంచంలో ఒక విప్లవం సృష్టించిన లీగ్. ఎందరో అనామక క్రికెటర్లను స్టార్లుగా మార్చిన లీగ్. ప్రాక్టీస్‌కు వెళ్లేందుకు బస్సు టిక్కెట్టుకు కూడా డబ్బులులేని యువ క్రికెటర్లను కోటీశ్వరులను చేసిన లీగ్.. క్రికెట్ అభిమానులకు రెండు నెలల పాటు అంతులేని వినోదాన్ని అందించే లీగ్.. ఇలా చాలానే పాజిటివ్ వైబ్స్ ఉన్నా.. ఐపీఎల్ మాత్రం ఇండియన్ క్రికెట్ జట్టుకు మాత్రం చేటు చేసిందనే భావన అందరిలోనూ ఉంది. ఐపీఎల్ వల్లే టీమిండియా ఐసీసీ ఈవెంట్స్‌లో బోల్తా పడుతుందని.. ప్రపంచ కప్‌ను గెలవలేకపోవడానికి ఐపీఎల్ ప్రధాన కారణమనే విమర్శలు వినిపిస్తూనే ఉంటున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా వేదికగా జరగిన టీ20 వరల్డ్ కప్ 2022 సెమీస్ వరకు వెళ్లి భారత్.. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఘోరపరాజయాన్ని చవిచూసింది. దీంతో మరో సారి ఐపీఎల్‌పై విరుచుకుపడ్డారు క్రికెట్ అభిమానులు.
అందుకు కారణం గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ కప్‌కు దూరం కావడమే. ఐపీఎల్ అంటే ఎలాంటి గాయాలు లేకుండా ఆడే బుమ్రా.. వరల్డ్ కప్ ముందు మాత్రం గాయపడి టోర్నీకి దూరమయ్యాడు. దీంతో బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. నిజం చెప్పాలంటే.. బౌలింగ్ వైఫల్యంతోనే టీమిండియా సెమీస్‌లో చిత్తుగా ఓడింది. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఆటగాళ్లు కోట్లు కురిపించే ఐపీఎల్‌ను కాదనుకుంటుండటం కూడా ఇండియన్ క్రికెటర్లపై భారత క్రికెట్ అభిమానుల కోపాన్ని మరింత పెంచుతోంది. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు ఆడిన కమిన్స్.. ఐపీఎల్ 2023లో ఆడటం లేదని ప్రకటించాడు.
ఐపీఎల్ 2022 మెగా వేలంలో ప్యాట్ కమిన్స్‌ను కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఏకంగా రూ.7.25 కోట్ల భారీ ధరపెట్టి కొనుగోలు చేసింది. ఇదే ధరను రానున్న రెండు సీజన్లలో కూడా చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. ఇంత భారీ మొత్తం వస్తున్నా.. ప్యాట్ కమిన్స్ మాత్రం ఐపీఎల్‌ను కాదనుకున్నాడు. ఆస్ట్రేలియా బిజీ షెడ్యూల్ కారణంగా ఐపీఎల్‌లో ఆడలేకపోతున్నానని ప్రకటించి.. ఐపీఎల్ 2023 సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఈ ప్రకటన చేసే సమయంలో.. ఐపీఎల్‌లో ఆడటాన్ని ఇష్టపడతాను కానీ.. ఆస్ట్రేలియాకు ఆడే సమయంలో శారీరకంగా, మానసికంగా ఫ్రెష్‌గా ఉండాలి… అందుకే ఐపీఎల్‌ను వదులుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
ఐపీఎల్‌లో రెండు నెలల వ్యవధిలో 14, 16 మ్యాచ్‌లు ఆడటం వల్ల ఆటగాళ్ల శారీరకంగా అలసటకు గురవుతున్నారు. అలాగే నిర్విరామంగా క్రికెట్ ఆడటం మానసికంగా కూడా చాలా క్రికెట్ ఆడేశామనే భావన వారిలో వస్తుంది. కొన్ని గాయాల పాలవుతున్నారు కూడా. దీంతో కొన్ని సార్లు జాతీయ జట్టుకు అందుబాటులో ఉండలేకపోతున్నారు. అది జాతీయ జట్టుకు ఎంతో నష్టం చేస్తుంది. జట్టులోని కీలక ఆటగాడు లేకుంటే ఆ జట్టు ఎంత బలహీన పడుతుందో.. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో మన చూశాం. అందుకే ప్యాట్ కమిన్స్ ఐపీఎల్‌ను వదులుకుని తన నేషనల్ టీమ్ ఆస్ట్రేలియానే ముఖ్యమంటూ తప్పుకున్నాడు. ఇదే బుద్ధి మన క్రికెటర్లలో కూడా రావాలని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.
Pat Cummins said “I really do love playing IPL but looking at the schedule, you want to be fresh physically & mentally for Australia”.
— Johns. (@CricCrazyJohns) November 16, 2022