రోజులు గడిచేకొద్ది టీ20 ప్రపంచ కప్ రసవత్తరంగా మారుతోంది. రోజురోజుకు ఉత్కంఠ రేపుతూ.. జరగబోయే మ్యాచ్ లపై ఆసక్తి రేపుతున్నాయి. కొన్ని గేముల్లో బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తే, మరి కొన్ని గేముల్లో బ్యాటర్లు పూర్తి పై చేయి సాధిస్తున్నారు. దాంతో ఈ ప్రపంచ కప్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. తాజాగా పాక్-దక్షిణాఫ్రికా మ్యాచ్ లో 106 మీటర్ల భారీ సిక్స్ నమోదు అయ్యింది. దాంతో ఇంతకు ముందు ఇండియాపై డేవిడ్ మిల్లర్ కొట్టిన 104 మీటర్ల సిక్స్ రికార్డు బద్దలు అయ్యింది.
వరల్డ్ కప్ లో పాక్-దక్షిణాఫ్రికా మధ్య తాజాగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి 43 పరుగులకే 4 వికెట్లు కోల్పొయి పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన ఇఫ్తికర్ అహ్మద్-షాదాబ్ ఖాన్ లు సౌతాఫ్రికా బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా షాదాబ్ ఖాన్ సిక్సర్లతో ప్రోటీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 22 బంతుల్లోనే 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. మరో వైపు ఇఫ్తికర్ సైతం తనదైన స్టైల్లో రెచ్చిపోయాడు. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి బౌలింగ్ లో ఓ భారీ సిక్సర్ బాది అందరిని ఆశ్చర్యపరిచాడు.
15వ ఓవర్లో ఎంగిడి వేసిన 4వ బంతిని ఇఫ్తికర్ భారీ షాట్ కొట్టాడు. ఆ బంతి ఏకంగా 106 మీటర్ల అవతల పడింది. దాంతో ఇప్పటి వరకు ప్రపంచ కప్ లో మిల్లర్ పేరిట ఉన్న లాంగెస్ట్ సిక్స్ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం ఈ భారీ సిక్స్ మ్యాచ్ కే హైలెట్ గా మారి వైరల్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్ లో ఇఫ్తికర్ అహ్మద్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 రన్స్ చేశాడు. ఇఫ్తికర్-షాదాబ్ ఖాన్ ధాటికి పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 9 ఓవర్లలో 4 వికెట్లకు 69 పరుగులు చేసింది. వర్షం అంతరాయం కలిగిండంతో మ్యాచ్ ను ఆపేశారు.