టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు ప్రాక్టీస్ విధానాన్ని తప్పు పట్టారు టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్. ఓవైపు అన్ని జట్లు కప్ గెలవాలి అన్న కసితో ప్రాక్టీస్ చేస్తుంటే టీమిండియాలో మాత్రం ఆ కసి కనిపించట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరికొన్ని గంటల్లో దాయాది దేశమైన పాక్ తో మ్యాచ్ పెట్టుకుని టీమిండియా ఆటగాళ్లకు ఆప్షనల్ ట్రైనింగ్ ఇవ్వడాన్ని తప్పు పట్టారు గవాస్కర్. అసలు ఈ విధానమే సరైంది కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మిగతా జట్లలోని ఆటగాళ్లు అందరు నెట్స్ లో తీవ్రంగా చమటోడుస్తుంటే.. టీమిండియాలోని కొంత మంది క్రికెటర్లు తాపీగా రెస్ట్ తీసుకుంటున్నారని మండిపడ్డాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆప్షనల్ డే.. అంటే మ్యాచ్ కు ముందు రోజు ప్రాక్టీస్ కు ఆటగాళ్లు రావొచ్చు.. రాకపోవచ్చు. అది వారిష్టం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ఆప్షనల్ ట్రైనింగ్ అనేది సరైంది కాదని, అది కేవలం కోచ్ కు, కెప్టెన్ కు మాత్రమే ఉండాలని టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. ఈ క్రమంలోనే ఇండియా టుడే న్యూస్ చానల్ తో మాట్లాడుతూ..”ఇప్పటికే జరగాల్సిన వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. అదీ కాక మెల్ బోర్న్ నుంచి ప్రయాణం చేసి వచ్చిన కారణంగా ఆ రోజూ ప్రాక్టీస్ చేయలేదు. ఇక ఇప్పుడేమో ఆప్షనల్ డే అంటూ.. ప్రాక్టీస్ చేయట్లేదు. ఇలా చేయటం వల్ల ఆటగాళ్లు రిథమ్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఆటగాళ్లు ప్రాక్టీస్ లో ఉంటేనే తమ రిథమ్ ను కోల్పోకుండా ఉంటారని” గవాస్కర్ పేర్కొన్నాడు.
సునీల్ గవాస్కర్ దీనిపై మరింతగా స్పందిస్తూ..”ప్రాక్టీస్ కు రాలేని ఆటగాళ్లకు కోచ్, కెప్టెన్ మాత్రమే అనుమతి ఇవ్వాలి. కంటిన్యూస్ గా బౌలింగ్ చేసి భుజం నొప్పి పెడితే, ఆ బౌలర్ కెప్టెన్ పర్మిషన్ తో ప్రాక్టీస్ కు రాకున్నా ఏం కాదు. ఇక గత మ్యాచ్ లో సెంచరీ చేసి అలసిపోయిన బ్యాటర్ కు విశ్రాంతి ఇవ్వడం అనేది కెప్టెన్ చేతిలో పనే. అలా కాకుండా ఆప్షనల్ ట్రైనింగ్ పేరిట ఆటగాళ్లను రూముల్లో పడుకోబెట్టడం ఏంటి? అసలు మీరు ఆస్ట్రేలియాకు వచ్చింది కప్ గెలవడానికా? రూముల్లో పడుకోడానికా?” అంటూ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి పద్దతులు ఆటగాళ్లను మరింత బద్దకస్తులుగా తయారు చేస్తాయని ఈ సందర్బంగా గవాస్కర్ పేర్కొన్నాడు. అయితే శనివారం ప్రాక్టీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, మరికొంత మంది మాత్రమే వచ్చారు.