ఏ ఆటగాడికైనా మాతృదేశ పేరు ప్రతిష్టలను ప్రపంచ నలుమూలల ఇనుమడింప చేయాలని ఉంటుంది. అందుకోసం అతడు చాలా శ్రమించాల్సి ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకున్నవి అన్నీ జరగవు.. దాంతో తమ కెరీర్ కు వీడ్కోలు పలుకుతుంటారు కొందరు ఆటగాళ్లు. ప్రస్తుతం ప్రపంచం మెుత్తం టీ20 వరల్డ్ కప్ వైపే చూస్తోంది. టోర్నీలో పాల్గొన్న ప్రతీ జట్టు, ప్రతీ ఆటగాడు తమ దేశానికి ప్రపంచ కప్ ను అందివ్వాలి అన్న ఆశతోనే వస్తారు. తమ కోరిక తీరకపోవడంతో క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలుకుతుంటారు. ప్రపంచ కప్ లో గొప్పగా రాణించలేకపోయినందుకు గాను విండీస్ కోచ్ ఫిలిప్ సిమ్మన్స్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఆఫ్గాన్ ఓటమికి బాధ్యత వహిస్తూ.. కెప్టెన్ పగ్గాలు వదిలేశాడు మహమ్మద్ నబీ. తాజాగా 38 సంవత్సరాల మరో క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.
టీ20 ప్రపంచ కప్ లో పెద్ద పెద్ద జట్లకు షాకిచ్చాయి పసికూనలు. చిన్న టీమ్స్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసింది నెదర్లాండ్స్. జింబాబ్వే, సౌతాఫ్రికా జట్లపై విజయాలను నమోదు చేసి.. తమ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేసింది. అయితే సౌతాఫ్రికాపై విజయం తర్వాత తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు నెదర్లాండ్స్ ప్లేయర్ స్టీఫెన్ మైబర్గ్. ఈ విషయాన్ని తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా సోమవారం తెలియజేశాడు. “17 ఏళ్ల క్రితం నేను నా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ను ప్రారంభించాను. దేవుడి దయ వల్ల ఇన్ని రోజులు క్రికెట్ లో నేను కొనసాగాను. అదీ కాక నేను అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టి 12 సంవత్సరాలు అయ్యింది. దేశం తరపున ఆడటం ఏ ఆటగాడికైన గొప్ప గౌరవం.. అది నాకు దక్కినందుకు గర్వపడుతున్నాను. ఈ ప్రపంచ కప్ తో నా కెరీర్ ను ముగిస్తానని నేను ఏనాడు ఊహించుకోలేదని” భావోద్వేగంతో రాసుకొచ్చాడు.
ఈ క్రమంలోనే దేశం కోసం ఆడేటప్పుడు నా రక్తం ఎప్పుడూ మరుగుతూనే ఉంటుందని మైబర్గ్ పేర్కొన్నాడు. ఇక నా కెరీర్ లో నాకు సహకరించిన సన్నిహితులకు, స్పాన్సర్స్ కు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు అంటూ స్టీఫెన్ రాసుకొచ్చాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైబర్గ్ తెలిపాడు. కూతురును చూడకుండా ఉండలేకపోతున్నాను, ఇక ఆగటం నా వల్ల కాదు అంటూ.. ఫ్యామిలీపై తనకున్న ప్రేమను వెలిబుచ్చాడు. ఇక మైబర్గ్ కెరీర్ విషయానికి వస్తే.. నెదర్లాండ్స్ తరపున 22 వన్డేల్లో 4 అర్దశతకాలతో 527 రన్స్ చేశాడు. ఇక 45 టీ20ల్లో 915 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలోనే వరల్డ్ కప్ ముగిసే సరికి ఇంకెన్ని రిటైర్మెంట్స్ చూడాలో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.