ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా విజయాలకు మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఓ కారణమా? పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఎందుకంటే భారత్ ఏ ప్రపంచకప్ ఆడుతున్నా సరే ధోనీ ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. వికెట్ కీపర్ సరిగా క్యాచ్ పట్టకపోయినా, బ్యాటర్ సరిగా ఫినిషింగ్ చేయలేకపోయినా సరే.. ఇలాంటి టైంలో ధోనీ ఉండుంటేనా మ్యాచ్ కచ్చితంగా గెలిచేసేవాళ్లం అని చాలామంది అభిమానులు ఫీలవుతారు. ఎందుకంటే మహీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అయితే ఇప్పుడు ధోనీ మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా గురించి మాట్లాడాల్సి వస్తే మహేంద్ర సింగ్ ధోనీ అందులో కచ్చితంగా ఉంటాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని మన జట్టు గెలుచుకోవడంలో ధోనీది కీలకపాత్ర. ఇక కెప్టెన్ గా, ఫినిషర్ గా ఎన్నో మ్యాచ్ లు గెలవడంలో ధోనీనే కీలకం. అలాంటి ధోనీ 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. బీసీసీఐ కోరిక మేరకు గతేడాది టీ20 ప్రపంచకప్ లో మన జట్టుకు మెంటార్ గా వ్యవహరించాడు. కానీ ఆ టోర్నీలో మైదానంలో ధోనీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి.. సూపర్-12 దశలోనే ఇంటిముఖం పట్టింది.
ఇక గతేడాది ఫిట్ గా లేని హార్దిక్ పాండ్యని ఆడించడం.. వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ లని జట్టులోకి తీసుకోవడం కూడా ఓటమికి కారణం అనిపించింది. ఇదంతా పక్కనబెడితే మెంటార్ గా ఉన్న టైంలోనే ధోనీ చేసిన మార్పులు.. ఇప్పుడు ఫలితాన్నిస్తున్నట్లు కనిపిస్తోంది. హార్దిక్ పాండ్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ బ్యాట్లని గమనిస్తే .. వాటి దిగువన కాస్త చెక్కినట్లు కనిపిస్తుంది. ఈ బ్యాటులని టీ20 వరల్డ్ కప్ కోసం మాత్రమే తయారుచేస్తారు. మైదానంలోకి ఏ వైపు అయినా సరే షాట్స్ కొట్టడానికి బాగా పనికొస్తాయి. గతేడాది ఐపీఎల్ లో హార్దిక్ షాట్ సెలెక్షన్ సరిగా లేదని భావించిన పాండ్య.. ఈ బ్యాట్లు వాడమని సూచించారట. దీంతో హార్దిక్ ఆటతీరే మారిపోయింది. మిగతా వారిలో పంత్ కి ఆడే ఛాన్స్ రావడం లేదు. కేఎల్ రాహుల్ కు అవకాశాలు వస్తున్నప్పటికీ మెప్పించలేకపోతున్నారు. ఒకవేళ పంత్, రాహుల్ కుదురుకంటే మాత్రం టీమిండియాకు ఇక తిరుగుండదు. కచ్చితంగా కప్ మనమే గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.