సంచలనాలతో మెుదలైన టీ20 ప్రపంచ కప్ 2022.. వాటిని టోర్నీ ఆసాంతం కొనసాగిస్తూనే ఉంది. కొన్ని మ్యాచ్ ల్లో బ్యాటర్లు భారీ స్కోర్లు సాధిస్తే మరికొన్ని మ్యాచ్ ల్లో బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. కొన్ని కొన్ని మ్యాచ్ ల్లో అయితే పెద్ద జట్ల బ్యాట్స్ మెన్ లకు చిన్న జట్టు బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా జరిగిన ఐర్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్ లో టీ20 ప్రపంచ కప్ 2022లో రెండవ హ్యాట్రిక్ నమోదు అయ్యింది. ఐర్లాండ్ బౌలింగ్ తురుపు ముక్క జోషువా లిటిల్ ఈ హ్యాట్రిక్ ను నమోదు చేశాడు. ఈ నేపథ్యంలోనే గత వరల్డ్ కప్ ల్లో హ్యాట్రిక్ తీసిన బౌలర్లపై ఓసారి లుక్కేద్దాం.
బ్యాట్స్ మెన్ లు ఎంత భారీ స్కోర్లు సాధించినప్పటికీ.. బౌలర్లు సరిగ్గా బౌలింగ్ చేయకపోతే ఆ జట్టు పరాజయాన్ని మూటకట్టుకోవడం ఖాయం. అందుకే టీమ్ గెలుపులో బౌలర్లు కీలక పాత్ర వహిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటికే ఈ టోర్నీలో రెండు హ్యాట్రిక్ లు క్రియేట్ అయ్యాయి. అయితే టీ20 ప్రపంచ కప్ ల్లో తొలి హ్యాట్రిక్ రికార్డును నమోదు చేసింది మాత్రం ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ బ్రెట్ లీ నే. 2007 లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బ్రెట్ లీ వరుస బంతుల్లో షకీబ్ అల్ హసన్, మెుర్తజా, అలోక్ కాపాలిని అవుట్ చేశాడు. దాంతో పొట్టి ప్రపంచ కప్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ గా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.
ఆ తర్వాత రెండో హ్యాట్రిక్ కోసం బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత 2021లోనే మళ్లీ హ్యాట్రిక్ నమోదు అయ్యింది. హేమా హేమీ బౌలర్లు ఉన్నప్పటికీ ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో ఐర్లాండ్ బౌలర్ కుర్టీస్ క్యాంఫర్ ఈ ఘనత సాధించాడు. నెదర్లాండ్స్ బ్యాట్స్ మెన్ లను బెంబేలెత్తిస్తూ నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు నేలకూల్చాడు. ఇక ఇదే టోర్నీలో శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా దక్షిణాఫ్రికాపై హ్యాట్రిక్ క్రియేట్ చేశాడు. వరుస బంతుల్లో మార్క్రమ్, బావుమా, ప్రిటోరియస్ ను పెవీలియన్ కు పంపాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్ లో లంక ఓడిపోయింది. 2021 వరల్డ్ కప్ లో బౌలర్లు విజృంభించారు. దాంతో ఈ వరల్డ్ కప్ లో ఏకంగా మూడు హ్యాట్రిక్ లు నమోదు అయ్యాయి.
Hat-tricks in Men’s T20 World Cup history:
Brett Lee
Curtis Campher
Kagiso Rabada
Wanindu Hasaranga
Karthik Meiyappan
Josh Little#CricTracker #JoshLittle #NZvIRE #T20WorldCup pic.twitter.com/qYUO1HdfO0— CricTracker (@Cricketracker) November 4, 2022
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ ఇంగ్లాండ్ పై ఈ ఘనతను సాధించాడు. వరల్డ్ స్పీడ్ బౌలర్ గా పేరొందిన రబాడా ఈ మ్యాచ్ లో వరుసగా క్రిస్ వోక్స్, ఇయాన్ మోర్గాన్, క్రిస్ జోర్డాన్ లను బొల్తా కొట్టించాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న 2022 టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 12లో జరిగిన మ్యాచ్ ల్లో భాగంగా రెండు హ్యాట్రిక్ లు నమోదు అయ్యాయి. ఈ సీజన్ లో తొలి హ్యాట్రిక్ ను యూఏఈ బౌలర్ కార్తీక్ మెయ్యప్పన్ తన పేర లిఖించుకున్నాడు. ఆసియా కప్ విజేత అయిన శ్రీలంక పై అతడు ఈ ఘనతను సాధించాడు. ఇక తాజాగా శుక్రవారం ఐర్లాండ్ – న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ యువ సంచలనం జోషువా లిటిల్.. తన వరుస బంతుల్లో కేన్ విలియమ్సన్, నీషమ్, శాంటర్న్ లను అవుట్ చేశాడు. దాంతో ప్రపంచ కప్ లో హ్యాట్రిక్ తీసిన ఆరో బౌలర్ గా చరిత్రకెక్కాడు. ఈ ఆరు హ్యాట్రిక్స్ ల్లో రెండు హ్యాట్రిక్స్ ఐర్లాండ్ బౌలర్లు తీసినవే కావడం విశేషం.