ఏ జట్టుపై గెలిచిన రానంత కిక్.. పాక్ పై గెలిస్తే టీమిండియాకు వస్తుంది. అసలు ఈ మ్యాచ్ అంటేనే చాలు.. దేశం యావత్తూ ఊగిపోతుంది. అందుకు తగ్గట్లే ఈసారి టీ20 ప్రపంచకప్ లో మనకు తొలి మ్యాచ్ పాకిస్థాన్ తో.. అది కూడా ఆదివారం.. అన్ని కలిసొచ్చాయి. దానితో పాటే విజయం కూడా వరించింది. కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ తో దాయాది జట్టుపై మరపురాని విజయం సాధించాం. అయితే ఇక్కడ ఓ బౌలర్ గురించి అందరూ మర్చిపోయారు. అతడు అద్భుతమైన ఆట గురించి చాలా తక్కువమంది మాట్లాడుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మెల్ బోర్న్ వేదికగా టీ20 వరల్డ్ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ జరిగింది. గత కొన్నాళ్ల నుంచి మన జట్టు బ్యాటింగ్ పరంగా అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. బౌలింగ్ లో మాత్రం తేలిపోతుంది. ఈ మధ్యే జరిగిన ఆసియాకప్ లోనూ ఇలాంటి ప్రదర్శనే చేసింది. దీంతో పాక్ తో మ్యాచ్ లో ఏం జరుగుతుందా అని భారత్ అభిమానుల్లో ఒకటే టెన్షన్. కానీ దాన్ని పటాపంచలు చేస్తూ యువ బౌలర్ అర్షదీప్ సింగ్ అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో మనోడి బౌలింగ్ మరుగున పడిపోయింది.
ఇక ఈ మ్యాచులో అర్షదీప్ మొత్తంగా.. నాలుగు ఓవర్లు వేసి 32 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. గత కొన్నాళ్ల నుంచి తనపై వస్తున్న విమర్శలకు బంతితో సమాధానం చెప్పాడు. ఇక రోజూ 150 సిక్సులు కొడతానని చెప్పి గొప్పలకు పోయిన అసిఫ్ అలీ.. అర్షదీప్ వేసిన షార్ట్ పిచ్ బంతికి అస్సలు ఆడలేకపోయాడు. ఏం చేయాలో తెలీక.. వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అలీనే కాదు మిగతా పాక్ బ్యాటర్లు కూడా ఈ మ్యాచులో భారత బౌలర్లు వేసిన షార్ట్ పిచ్ బంతుల్ని ఆడలేక తెగ ఇబ్బంది పడ్డారు. కోహ్లీ.. ఛేజింగ్ లో మాస్టర్ కావొచ్చు కానీ పాక్ ఎక్కువ పరుగులు చేయకుండా నియంత్రించిన అర్షదీప్ లాంటి కుర్రాడిని కూడా మనం కచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే. మరి అర్షదీప్ బౌలింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.