ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన టీ20 వరల్డ్ కప్ ఎట్టకేలకు గ్రాండ్ గా పూర్తయింది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు అద్భుత విజయం సాధించింది. 19 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి, పాక్ జట్టుపై 5 వికెట్ల తేడాతో గెలిచింది. రెండోసారి టీ20 వరల్డ్ కప్ ని ముద్దాడింది. తక్కువ స్కోరులే నమోదైన ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారా అని చివరి వరకు టెన్షన్ టెన్షన్ గా సాగింది. కానీ ఇంగ్లాండ్ బ్యాటర్లు నిలకడగా ఆడటంతో.. ఆ జట్టు విన్నర్ గా నిలిచింది. ఇక ఫైనల్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన బెన్ స్టోక్స్.. మరోసారి ఇంగ్లాండ్ జట్టు కప్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం జరిగిన ఫైనల్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాక్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. మంచిగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాక్ జట్టు.. నెమ్మదిగా తడబడింది. ఓపెనర్లు రిజ్వాన్ 15 పరుగులు చేసి ఔట్ కాగా, కాసేపటికే 32 పరుగులు చేసిన బాబర్ ఆజామ్ కూడా పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత వరసగా ఒక్కక్కరు తక్కువ పరుగులకే ఔటయ్యారు. మసూద్ మాత్రమే 38 పరుగులు చేసి పాక్ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 137/8 స్కోరు మాత్రమే చేయగలిగింది.
అనంతరం ఛేదనలో స్టార్టింగ్ నుంచి ఇంగ్లాండ్ జట్టు ఆచితూచి ఆడింది. ప్రారంభంలో హేల్స్ వికెట్ తీసిన అఫ్రిది.. ప్రత్యర్థి జట్టును భయపెట్టాడు. దీంతో ఇంగ్లీష్ జట్టు చాలా రక్షణాత్మకంగా ఆడింది. కెప్టెన్ బట్లర్ 26 పరుగులు చేసి ఔటయ్యాడు. మిగిలిన బ్యాటర్లలో సాల్ట్ 10, హేరీ బ్రూక్ 20 పరుగులు చేశారు. ఇక బెన్ స్టోక్స్ 52, మొయిన్ అలీ 19 చివర వరకు ఉండి మ్యాచ్ ని గెలిపించారు. 1992 వరల్డ్ కప్ సీన్ రిపీట్ చేసి కప్ కొట్టాలనుకున్న పాక్ ఆశలపై నీళ్లు చల్లారు. ఇక టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ జట్టు.. క్రికెటర్లందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
ENGLAND WIN THE 2022 T20 WORLD CUP! 🏴🏆#T20WorldCup | #T20WorldCupFinal pic.twitter.com/qKwRPJz5mA
— ESPNcricinfo (@ESPNcricinfo) November 13, 2022