క్రికెట్ ఇంగ్లండ్‌లో పుట్టినా.. దాన్ని రారాజులా ఏలింది మాత్రం వెస్టిండీస్ జట్టే. వన్డే వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత తొలి రెండు సార్లు కరేబియన్ జట్టే విశ్వవిజేతగా నిలిచింది. మూడో సారి ఫైనల్‌లో టీమిండియా చేతుల్లో ఓడింది. అయినా కూడా ప్రపంచ క్రికెట్‌లో అప్పటికీ వెస్టిండీస్ టీమే నంబర్ వన్. ఎంతో ఘనమైన చరిత్ర కలిగి వెస్టిండీస్.. ఆ తర్వాత 2012, 2016లో టీ20 వరల్డ్ కప్స్ గెలిచి సత్తా చాటింది. ఇలా రెండు సార్లు వన్డే ప్రపంచ కప్‌లు, రెండు సార్లు టీ20 వరల్డ్ కప్‌లు నెగ్గిన విండీస్ టీమ్.. తొలి సారి క్వాలిఫైయర్స్‌లో ఆడి ఇంటి బాట పట్టింది. క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ టీమ్‌కు ఇలాంటి దుస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ.. ఇప్పుడు విండీస్ క్రికెట్ అత్యంత దయనీయ స్థితిలో ఉంది.
వెస్టిండీస్ క్రికెట్‌కు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం విదేశీ లీగ్స్ అనే విమర్శలు ఉన్నాయి. జాతీయ జట్టుకు ఆడకుండా చాలా మంది స్టార్ క్రికెటర్లు విదేశీ లీగ్స్‌లో ఆడుతున్నారని అందుకే జట్టు బలహీన పడి అంతర్జాతీయ వేదికలపై చతికిల పడుతోందని క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. దీనికి కొంతమంది క్రికెటర్లు తాము ఫిట్‌గా ఉన్న సమయంలోనే కొంత డబ్బు వెనకేసుకోవాలని అందుకే లీగ్స్ ఆడుతున్నాం అని సమర్థించుకుంటున్నారు. వారి వాదనలో కూడా నిజముంది. వెస్టిండీస్ ఆర్థికంగా చాలా బలహీనమైన క్రికెట్ బోర్డు. ఒకానొక సందర్భంలో ఆటగాళ్లకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. తమ జీతాల కోసం విండీస్ క్రికెటర్లు బోర్డుపై తిరుగుబాటు కూడా చేశారు.
ఈ సమయంలోనే ఐపీఎల్ లాంటి కనకవర్షం కురిపించే లీగులు వారికి కొండంత అండగా నిలిచాయి. పైగా టీ20 క్రికెట్‌కు విండీస్ ఆటగాళ్లు పెట్టింది పేరు. క్రిస్ గేల్, పొలార్డ్, బ్రావో, సునీల్ నరైన్ లాంటి స్టార్ క్రికెటర్లు ప్రపంచంలో ఎక్కడ టీ20 లీగ్ జరిగినా వీరికి భారీ డిమాండ్ ఉండేది. అందుకే ప్రపంచంలో జరిగే ప్రతి లీగ్‌లో సత్తా చాటేది విండీస్ ఆటగాళ్లే కానీ.. ప్రపంచ కప్ లాంటి టోర్నీల్లో విండీస్ టీమ్ మాత్రం తేలిపోయేది. తాజాగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లోనూ ఘోరంగా గ్రూప్ దశలో ఐర్లాండ్ లాంటి చిన్న జట్ల చేతిలో ఓడి వెస్టిండీస్ సూపర్ 12కు కూడా అర్హత సాధించలేదు. ఇలాంటి పరిస్థితి నుంచి జట్టు బయటపడాలంటే ఆటగాళ్లను ఆర్థికంగా బలోపేతం చేయాలని వెస్టిండీస్ మాజీ క్రికెటర్, రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్ గెలిచిన జట్టు కెప్టెన్ డారెన్ సామీ అభిప్రాయపడ్డాడు.
భారత క్రికెట్ బోర్డు ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు. అందుకే భారత్ తమ ఆటగాళ్లను వేరే లీగ్స్‌లో ఆడనీయకుండా అడ్డుకున్నా.. వారిని ఆర్థికంగా ఆదుకోగలదు. అక్కడి లిస్ట్ ఏ క్రికెటర్ కూడా భారీ మొత్తంలో పారితోషకం అందుకుంటాడు. కానీ.. వెస్టిండీస్ క్రికెటర్లకు అలాంటి పరిస్థితి లేదు. అయినా ఆర్థికంగా బలంగాలేని బోర్డులు తమ ఆటగాళ్లను విదేశీ లీగ్స్‌లో ఆడనీయకుండా అడ్డుకోలేవు. ఎందుకంటే ఆటగాళ్ల పీక్ టైమ్ చాలా తక్కువ. ఆ టైమ్‌లోనే వాళ్లు నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. ప్రేమతో ఆడే రోజులు పోయాయి. అలా ఆడితే మాకొచ్చే జీతాలతో సూపర్‌మార్కెట్‌లో నెలవారీ సరుకులు కూడా కొనలేం అని సామీ పేర్కొన్నాడు.
“It hurts man, it hurts.” Darren Sammy’s eyes, the sad smile tells it all the moment he was asked about the terminal decline of West Indies cricket.https://t.co/cagZdAqw4p
— Economic Times (@EconomicTimes) November 1, 2022