“పవర్ ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ ఫుల్ ప్లేసెస్”
ఇది సినిమా డైలాగ్..
కానీ..,
యోధులు సైతం తన ముందు చిన్నబోయేలా ఎదిగిన ఓ రాజు గురించి చెప్పాలంటే అక్షరాలు మారుతాయి.
“పవర్ ఫుల్ పీపుల్ డామినేట్ పవర్ ఫుల్ లెజండ్స్”
చరిత్ర పుటలను తన చిరునామాగా మార్చుకుని
గెలుపుని తన దాసోహంగా చేసుకుని
రికార్డుల వేటలో అలుపు ఎరుగని రారాజుగా వెలిగిపోతున్న ఆ రాజు పేరు..
విరాట్ కోహ్లీ
వివియన్ రిచర్డ్స్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, బ్రెయిన్ లారా, సౌరవ్ గంగూలీ, రికీ పాంటిగ్, రాహుల్ ద్రవిడ్.. వీళ్లంతా క్రికెట్ చరిత్రలో లెజండ్స్. వీళ్ళని మించిన పోటుగాడు రావడం అసాధ్యం అని ప్రేక్షకులు నమ్మిన కాలం ఉంది. ఆ నమ్మకం నిజమే. ఇంత మంది యోధుల రికార్డ్స్ తిరగరాయడం, వీరిని మరిపించడం ఈ దశాబ్దపు ఆటగాళ్లకు సాధ్యం అయ్యే పని కాదు. అయితే.. ఈ లెక్కలు అన్నీ వర్తించేది సాధారణ మనుషులకే. ఈ గ్రహం మీద పుట్టి, ఈ గ్రహం మీద పెరిగిన వారికే. ఇందుకే.. ఆధునిక క్రికెట్ ప్రపంచానికి కూడా ఒక లెజండ్ ఉండాలని.. కాదు కాదు.. ఏకైక కింగ్ లా క్రికెట్ ప్రపంచాన్ని ఏలాలని.. మనిషికి సాధ్యం కాని ఆట తీరుతో ఒక గ్రహాంతర వాసిలా భూమిపైకి వచ్చేశాడు విరాట్ కోహ్లీ.
1988 నవంబర్ 5న ఢిల్లీలో జన్మించిన విరాట్.. చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు. 2006లో ఫస్ట్ క్రికెట్‌లో అడుగుపెట్టన కోహ్లీ.. 2008లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్‌తో వెలుగులోని వచ్చాడు. ఆ ఏడాది వరల్డ్ కప్ గెలిచిన అండర్ 19 జట్టుకు కోహ్లీ కెప్టెన్. ఆ వరల్డ్ కప్‌లో కోహ్లీ చేసిన అద్భుత ప్రదర్శన ఆధారంగా కోహ్లీకి జాతీయ జట్టు నుంచి పిలుపొచ్చింది. అప్పటికే జట్టులో సచిన్, సెహ్వాగ్, గంభీర్, ధోని, యువరాజ్ లాంటి హేమాహేమీలు ఉన్నారు. వీరి మధ్య పిల్లాడిలా కోహ్లీ ఉండేవాడు. కానీ.. చరిత్ర సృష్టించబోతున్న వ్యక్తి ఇవేవి అడ్డుకాదు కదా. 2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ తన తొలి సెంచరీ నమోదు చేశాడు. ఐదు వన్డేల సిరీస్‌లో ఆ సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలతో అద్భుత రాణించిన కోహ్లీ.. లంక పేస్ కింగ్.. మలింగాను పిచ్చుకొట్టుడు కొట్టింది ఆ సిరీస్‌లోనే. ఒక కుర్ర క్రికెటర్ మలింగాను ఈ రేంజ్‌లో కొట్టడంతో కోహ్లీ పేరు మారుమోగిపోయింది. ఈ సిరీస్‌తో టీమిండియా మిడిల్డార్‌కు బ్యాక్‌బోన్‌లా మారిపోయాడు.
2011 వరల్డ్ కప్ జట్టులో చోటు సాధించిన కోహ్లీ.. సచిన్ చిరకాల కోరక తీర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో మొత్తం 282 పరుగులు చేసిన కోహ్లీ.. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాది ఔరా అనిపించాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లోనూ సెహ్వాగ్, సచిన్ వెంటవెంటనే అవుటైనా.. గంభీర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 2014లో ధోనికి గాయం కావడంతో టీమిండియాకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఆ తర్వాత.. ధోని వారసుడిగా మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా అయిన కోహ్లీ.. 2016లో కెరీర్ బెస్ట్ ఫామ్‌లో కొనసాగాడు. ఆ ఏడాది 41 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఏకంగా 2595 పరుగులు సాధించాడు. అదే ఐపీఎల్‌లోనూ కోహ్లీ తన హవాను కొనసాగించాడు. ఒకే ఏడాది అత్యధికగా 4 సెంచరీలు చేశాడు.
విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా టీమిండియా టెస్టు క్రికెట్‌లో రారాజుగా అవతరించింది. 2016లో కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా మూడు టెస్టు సిరీస్‌లను గెలిచింది. టెస్టు క్రికెట్‌లో అగ్రెసివ్ కెప్టెన్సీ చేసిన కోహ్లీ.. టీమిండియాను టెస్టుల్లో నంబర్ వన్‌గా చేశాడు. కోహ్లీ పేరిట లెక్కలేనన్ని రికార్డులు ఉన్నాయి. ఇండియన్ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అనేక రికార్డులు విరాట్ కోహ్లీ బద్దలు కొడుతూ వచ్చాడు. సచిన్ 100 సెంచరీల రికార్డును బద్దలుకొట్టే ఆటగాడిగా కనిపించిన కోహ్లీ.. కెప్టెన్సీ భారంతో 2019-2021 మధ్య కాస్త నెమ్మదించాడు. తన కెరీర్‌లో ఎన్నో గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీకి ఛేజ్ మాస్టర్ అనే బిరుదు ఉంది. టార్గెట్‌ను ఒక లెక్క ప్రకారం ఛేజ్ చేయడంలో కోహ్లీని మించిన క్రికెటర్ ప్రపంచలోనే లేడు.
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఆడిన బెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో టాప్ 5ను ఎంపిక చేయడమే కానీ.. 2015 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగి.. పాక్ ముందు 300 టార్గెట్ ఉంచాడు. ఇక 2018లో సౌతాఫ్రికాతో టెస్టులో కోహ్లీ విశ్వరూపం చూపించాడు. 153 పరుగులు చేసి టీమిండియాను ఆదుకున్నాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినా.. ప్రొటీస్ బౌలర్లను తట్టుకుని కోహ్లీ చూపించిన పోరాటం అద్భుతమనే చెప్పాలి. ఇక అదే ఏడాది సౌతాఫ్రికాతోనే వన్డే సిరీస్‌లోనూ కోహ్లీ చెలరేగిపోయాడు. 6 వన్డేల సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో 96 బంతుల్లోనే 129 పరుగులతో అదరగొట్టాడు. ఇక ఆసియా కప్ 2012లో విరాట్ కోహ్లీ వన్డేల్లో తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ బౌలర్లను చీల్చిచెండాడుతూ.. 148 బంతుల్లో 183 పరుగులు చేసి.. వన్డేలో తన హైఎస్ట్ స్కోర్ నమోదు చేశాడు.
ఇక ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్స్ కోహ్లీ కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్‌గా నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే అంగీకరించాడు. 82 పరుగులతో ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను గెలిపించి.. అంతకుముందు తనను విమర్శించిన వారిచేతే సలాం కొట్టించుకున్నాడు. ఫామ్‌లో లేడు.. జట్టుకు భారం అయ్యాడనే విమర్శలను ఎదుర్కొన్న కోహ్లీ.. తన ఆటతోనే వారికి సమాధానం చెప్పాడు. ఆసియా కప్ 2022లో అఫ్ఘానిస్థాన్‌పై సెంచరీ చేసి కోహ్లీ.. చాలా కాలంగా వేధిస్తున్న సెంచరీ భారాన్ని దించేసుకున్నాడు. అప్పటి నుంచి మళ్లీ వింటేజ్ కోహ్లీని చూపిస్తున్నాడు. ఇక మన తాతాల కాలంలో వీవీఎన్ రిచర్డ్స్ గురించి చెప్పుకునే వారు.. మన తండ్రులు సచిన్‌ను తమ హీరోగా కీర్తించేవారు.. మనం మన పిల్లలకు కోహ్లీ గురించి చెప్పుకునేలా చేశాడు కోహ్లీ. క్రికెట్ బతికున్నంత కాలం ఏ క్రికెటర్ కవర్‌డ్రైవ్ ఆడినా.. కోహ్లీ గుర్తురాకమానడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ పేరిట ఉన్న భారీ రికార్డులు.. (ఈ రికార్డుల్లో కోహ్లీనే నంబర్ వన్)