ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్.. క్రికెట్ ప్రేక్షకులకు అసలు సిసలైన టీ20 మజాని అందిస్తోంది. ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఈ వరల్డ్ కప్ లో మాత్రం అనుకోని సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. ప్రతి మ్యాచ్ ఆఖరి బంతి వరకు సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ వరల్డ్ కప్ లో జింబాబ్వే జట్టుని ప్రత్యేకంగా అభినందిచాల్సి ఉంది. ప్రతి మ్యాచ్ లో ఎంతో గొప్ప పోరాట పటిమని చూపిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ పై జింబాబ్వే చేసిన పోరాటం యావత్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆఖరి బంతి వరకు ఈ మ్యాచ్ ఒక థ్రిల్లర్ సినిమాని తలపించింది. నిజానికి గెలవాల్సిన మ్యాచ్ లో జింబాబ్వే ఓడందనే చెప్పాలి. షాన్ విలియమ్స్ పోరాటం పూర్తిగా వృథా అయిపోయింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయిందనే చెప్పాలి. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. షాంటో 55 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 71 పరుగులు చేశాడు. ఆ తర్వాత అఫీఫ్ హుస్సేన్(29), షకీబ్(23) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. బంగ్లాదేశ్ బ్యాటర్లను జింబాబ్వే బాగానే కట్టడి చేసిందని చెప్పాలి. బౌలింగ్ విషయానికి వస్తే.. నగరవ, ముజరబాని చెరో 2 వికెట్లు తీసుకున్నారు. సీన్ విలియమ్స్, సికందర్ రజా చెరో వికెట్ పడగొట్టారు. ఛేజింగ్ లో జింబాబ్వే బంగ్లాదేశ్ ని వణికించిందనే చెప్పాలి. ఎందుకంటే కేవలం 3 పరుగుల తేడాతో జింబాబ్వే జట్టు ఓడిపోయింది.
సీన్ విలియమ్స్ పోరాటం వృథా అయ్యిదనే చెప్పాలి. సీన్ విలియమ్స్ 42 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. అతను ఇంకో 4 బాల్స్ అదనంగా ఆడి ఉన్నట్లయితే కచ్చితంగా జింబాబ్వే గెలిచేదని చెప్పొచ్చు. సీన్ ఆఖరి వరకు జట్టును గెలిపించేందుకు పోరాడాడు. ర్యాన్ బర్ల్(27) మినహా మరెవరూ రాణించలేదు. ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివర్లో బంగ్లాదేశ్ 3 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్ మాత్రం ఆఖరి బంతి వరకు ప్రేక్షకులను కుర్చీల అంచున కూర్చునేలా చేసింది. ఆఖరి బంతి నోబాల్ కావడం కూడా మరింత టెన్షన్, ఉత్కంఠకు గురి చేసింది. కానీ, జింబాబ్వేకి అదృష్టం కలిసి రాలేదు. నిజానికి జింబాబ్వే చిన్న జట్టు అని అంతా అనుకుంటారు. కానీ, వాళ్లు పోరాడిన తీరు అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది.