టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో ఇరగదీస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అతని బ్యాటింగ్ స్టయిల్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. టీ20 ప్రపంచ కప్ లో జట్టుకు వెన్నుముఖలా నిలిచిన సూర్య, న్యూజిలాండ్ తో జరుగుతన్న టీ20 సిరీస్ లోనూ అదే ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. కివీస్‌తో జరిగిన రెండో టీ20లో ఏకంగా సెంచరీతో చెరిగి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో సూర్య టెస్టు ఫార్మాట్ ఎంట్రీపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇదిలావుంటే సూర్య తాను నిలకడగా రాణించడానికి గల కారణాన్ని వెల్లడించాడు. తన సతమణి దెవిషా శెట్టి కారణంగానే తాను నిలకడగా రాణించగలుగుతున్నానని చెప్పుకొచ్చాడు.
రెండో టీ20లో సూర్య కివీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడనే చెప్పాలి. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లుగా పెవిలియన్ చేరుతున్నా తాను మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 111 పరుగులు చేశాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్య.. మరో 17 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇది అంతర్జాతీయ టీ20ల్లో రెండో శతకం కాగా.. రెండు సెంచరీలు ఈ ఏడాదే చేయడం విశేషం. ఈ తరుణంలో సూర్యను టెస్ట్ అరంగేట్రం గురించి ప్రశ్నించారు. దానికి అతను బదులు ఇస్తూ.. ఆ రోజు కూడా త్వరలోనే వస్తుందని తెలిపాడు. క్రికెట్ కెరీర్‌ను స్టార్ట్ చేసినప్పుడు రెడ్ బాల్‌తో స్టార్ట్ చేస్తామని, ముంబై జట్టు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడానని, ఆ ఫార్మాట్ గురించి కూడా తనకు బాగా తెలుసు అని, ఆ ఫార్మాట్ క్రికెట్‌ను కూడా ఎంజాయ్ చేస్తానని తెలిపాడు.
తల్లిదండ్రులతో రోజు ఓ అరగంట మాట్లాడుతానని చెప్పిన సూర్య, ఫ్యామిలీతో గడపడం వల్ల తాను చాలా ప్రశాంతంగా ఉంటానని, వారి మాటలు తనను ఒదిగి ఉండేలా చేస్తాయని తెలిపాడు. ‘నేనుప్పుడూ నా హద్దుల్లోనే ఉండేందుకు ప్రయత్నిస్తా. అందులోనూ నేను ఏ పర్యటనకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది. సగం సమయాన్ని ఆమెతోనే గడుపుతాను. మ్యాచ్ లేని రోజు సరదాగా ఆమెతో బయటకు షికారుకు వెళ్లడం ఇష్టం. ఇక మా తల్లిదండ్రులతో ప్రతి రోజూ మాట్లాడుతాను. వారు క్రికెట్ గురించి అస్సలు మాట్లాడరు. నేను నా జోన్ లో ఉండేలా.. ప్రశాంతతను కలిగిస్తారు. ఇది నా లైఫ్‌లో రోజు జరిగే రొటీన్ ప్రక్రియ. ఇదే నన్ను నిలకడగా రాణించడానికి సహాయపడుతోంది..’ అని వెల్లడించాడు.