గత కొన్ని రోజులుగా టీ20ల్లో ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిన పేరు సూర్య కుమార్ యాదవ్. టీ20ల్లో దాదాపు ఆడిన ప్రతీ మ్యాచ్ లో బౌలర్లకు చుక్కలు చూపించాడు ఈ 360 బ్యాటర్. దాంతో టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. ఇక ఇదే ఊపును వన్డేల్లో సైతం కొనసాగించాలి అనుకున్నాడు. కానీ న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో దారుణంగా విఫలం అయ్యాడు. రెండు మ్యాచ్ ల్లో అవకాశం రాగ పరుగులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దాంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. ప్రస్తుతం SKY తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే..
సూర్య కుమార్ యాదవ్.. టీమిండియా మిస్టర్ 360 గా పేరుగాంచాడు. సూర్య కొట్టే షాట్స్ కు మంత్ర ముగ్దులు కానీ అభిమానులుండరు అన్నది కాదనలేని వాస్తవం. అంతలా ఆకట్టుకుంటాయి అతడు ఆడే షాట్స్. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ లో దుమ్మురేపుతున్న సూర్య భాయ్.. ఇప్పుడు టెస్టు క్రికెట్ లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ కు దూరంగా ఉన్నాడు సూర్య. ఈ సమయాన్ని సద్వినియోగా చేసుకోవాలని పక్కా ప్లాన్ వేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ ఏడాది రంజీ సీజన్ లో రాణించి టీమిండియా టెస్ట్ క్రికెట్ జట్టులో చోటు సంపాదించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
ఇందుకు సంబంధించిన వివరాలను మహారాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ సెక్రటరీ అజింక్యా నాయక్ వెల్లడించారు.”గత కొన్ని రోజులుగా సూర్య కుమార్ వైట్ బాల్ క్రికెట్ తో బిజీబిజీగా ఉన్నాడు. అందుకే అతడు కొంత విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. అందుకే ఆంధ్రాతో జరిగే తొలి మ్యాచ్ కు సూర్య దూరం కానున్నాడు” అని అజింక్యా నాయక్ తెలిపారు. సూర్య కుమార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ముంబై తరపున ఆడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొంత విశ్రాంతి తర్వాత డిసెంబర్ 20న హైదరాబాద్ తో జరిగే రెండో మ్యాచ్ కు సూర్య అందుబాటులో ఉంటాడు అని మహారాష్ట్ర క్రికెట్ వర్గాలు తెలిపాయి.
సూర్య కుమార్ రాకతో ముంబై జట్టు మరింత బలపడుతుందని అజింక్యా నాయక్ తెలిపారు. రంజీల్లో దుమ్మురేపి త్వరలోనే భారత టెస్ట్ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని సూర్య భాయ్ చూస్తున్నాడు. ఇక సూర్య ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే.. 77 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 5326 పరుగులు సాధించాడు. ఓ డబుల్ సెంచరీతో పాటుగా 14 సెంచరీలు, 26 ఆఫ్ సెంచరీలు ఉండటం విశేషం. టీ20ల్లో అదరగొట్టిన సూర్య భాయ్ సంప్రదాయ క్రికెట్ అయిన టెస్ట్ ల్లో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి అంటే అభిమానులు మరికొన్ని రోజులు ఆగాల్సిందే.