అతడు ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్. క్రీజులో అడుగుపెడితే సిక్సులు, ఫోర్ల హోరు గ్యారంటీ. స్టేడియంలో కూర్చొన్న ప్రేక్షకులకు తన బ్యాటింగ్ తో మెరుపులు చూపిస్తాడు. అలాంటి సూర్య ఇప్పుడు డకౌట్స్ తో చెత్త రికార్డ్ సృష్టించాడు.
సూర్యకుమార్ యాదవ్.. ఈ పేరు చెబితే మొన్నటివరకు అందరూ ఆహా ఓహో అనేవారు. ఇప్పుడు పూర్తిగా డిసప్పాయింట్ అవుతున్నారు. దానికి కారణం సూర్య ఘోరంగా విఫలమవుతుండటం. కనీసం ఒక్కటంటే ఒక్క ఇన్నింగ్స్ లోనూ కొంతసేపు అయినా క్రీజులో ఉండలేకపోతున్నాడు. గత కొన్ని మ్యాచుల నుంచి ఇదే తంతు. అయినాసరే టీమిండియాలో అతడికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. దానికి కారణం అతడు కుదురుకుంటాడేమోనని.. కానీ అది ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. తాజాగా జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ నే తీసుకోండి. మూడు వన్డేల్లో వరసగా డకౌట్స్ అయ్యాడు. భారత జట్టు చరిత్రలో ఘోరమైన రికార్డుని తన పేరిట నమోదు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియాలోకి వచ్చిన కొన్నాళ్లలోనే సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ స్థాయికి ఎదిగాడు. క్రీజులో అడుగుపెడితే బౌండరీలతో రెచ్చిపోయే సూర్య.. టీ20ల్లో అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ వన్డేలకు వచ్చేసరికి పూర్తిగా ఫెయిలవుతున్నాడు. ఇప్పటివరకు 21 వన్డేల్లో ఆడి 24.05 యావరేజ్ తో 433 పరుగులే చేశాడు. తొలి ఆరు ఇన్నింగ్స్ ల్లో 31*, 53, 40, 39, 34*, 64 పరుగులు చేసిన సూర్య.. ఆ తర్వాత పూర్తిగా ట్రాక్ తప్పాడు. అస్సలు క్రీజులో నిలబడటానికే ఇష్టం లేదన్నట్లు ప్రవర్తిస్తున్నాడు.. ఆస్ట్రేలియా సిరీస్ లో మూడు వన్డేల్లో అస్సలు పరుగులేం చేయకుండా వచ్చీ రాగానే తొలి బంతికే ఔటైపోయాడు. తొలి రెండు మ్యాచుల్లో స్టార్క్ బౌలింగ్ కు బలైపోగా, చివరి వన్డేలో అగర్ బౌలింగ్ లో ఔటై వెనుదిరిగాడు. ఇలా ఓ వన్డే సిరీస్ లో వరసగా అన్ని మ్యాచుల్లోనూ డకౌట్ అయిన తొలి క్రికెటర్ గా చెత్త రికార్డ్ సృష్టించాడు.
తాజాగా జరిగిన చివరి వన్డేనే తీసుకోండి. సూర్యకుమార్ ని ఏడో స్థానంలో పంపించినా సరే ఫలితం లేకుండా పోయింది. ఏమైనా బ్యాటింగ్ చేస్తాడేమోనని కెప్టెన్ రోహిత్ శర్మ అనుకున్నాడు. కానీ డకౌట్ అయి పెవిలియన్ కు వచ్చేశాడు. శ్రేయస్ అయ్యర్ కు గాయమవడం వల్లనే సూర్యకు జట్టులో చోటు దక్కుతుంది. అతడు తిరిగొస్తే మాత్రం సూర్య ప్లేస్ గల్లంతు కావడం గ్యారంటీ. సూర్య ఫామ్ ఇలానే కొనసాగితే మాత్రం.. వన్డే ప్రపంచకప్ లోనూ చోటు దక్కడం కష్టమే అనిపిస్తుంది. ఇదిలా ఉండగా చెన్నైలో జరిగిన చివరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 269 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో టీమిండియా తడబడింది. 248 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో 2-1 తేడాతో ఆసీస్ జట్టు వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. సరే ఇదంతా పక్కనబెడితే సూర్య డకౌట్స్ తో చెత్త రికార్డు నమోదు చేయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.